Rahul: చిన్న కారులో వచ్చాడు శీష్ మహల్‌ నిర్మించాడు.. కేజ్రీవాల్ పై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు

by vinod kumar |
Rahul: చిన్న కారులో వచ్చాడు శీష్ మహల్‌ నిర్మించాడు.. కేజ్రీవాల్ పై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ(Aap) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌ (Aravind Kejriwal) పై తీవ్ర విమర్శలు గుప్పించారు. మొదట్లో చిన్న కారుతో వచ్చిన కేజ్రీవాల్ అధికారంలోకి రాగానే శీష్ మహల్ నిర్మించారని మండిపడ్డారు. దేశ రాజధానిలోని పట్పర్‌గంజ్‌ (Patpar ganj)లో మంగళవారం నిర్వహించిన ర్యాలీలో రాహుల్ ప్రసంగించారు. 2020లో మతపరమైన అల్లర్లు చెలరేగి ఢిల్లీ హింసాత్మకంగా ఉన్నప్పుడు కేజ్రీవాల్ కనిపించలేదని ఆరోపించారు. పేదలకు అవసరమైనప్పుడు, సమస్యలతో ప్రజలు అల్లాడుతున్నప్పుడూ ఆయన ముందుకు రాలేదన్నారు. భిన్నమైన రాజకీయాలు చేస్తానని హామీ ఇచ్చిన కేజ్రీవాల్ ఢిల్లీలో భారీ మద్యం కుంభకోణానికి పాల్పడ్డారని ఫైర్ అయ్యారు. మనీశ్ సిసోడియా (Manish sisodiya) లిక్కర్ స్కామ్‌కు రూపశిల్పి అని, అందుకే పట్పర్ గంజ్ సీటు నుంచి పారిపోయారని ఎద్దేవా చేశారు.

‘దేశంలో భావజాల యుద్ధం జరుగుతోంది. విద్వేషాన్ని, హింసను వ్యాప్తి చేసే బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యక్తులు ఒకవైపు ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ ఉంది. విద్వేషాల సమయంలో ప్రేమ దుకాణాన్ని తెరవడమే మా సిద్దాంతం. ద్వేషం, భయం, హింస లేని భారత్ మాకు కావాలి’ అని తెలిపారు. ప్రతి పౌరుడు సమానమేనని రాజ్యాంగం చెబుతుంటే, ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) మాత్రం కోటీశ్వరుల భారతదేశాన్ని కోరుకుంటున్నారన్నారు. దేశ సంపదను బిలియనీర్లకు అప్పగించాలని మోడీ భావిస్తున్నారన్నారు. సాధారణ ప్రజల చేతుల నుంచి డబ్బును తీసుకొని బిలియనీర్లకు అప్పగించడమే బీజేపీ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోందని మండిపడ్డారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections) ఫిబ్రవరి 5న జరగనున్న విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్, బీజేపీ, ఆప్ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి.

Next Story

Most Viewed