అమేఠీ నుంచి పోటీపై స్పష్టత ఇచ్చిన రాహుల్ గాంధీ

by S Gopi |   ( Updated:2024-04-17 09:00:43.0  )
అమేఠీ నుంచి పోటీపై స్పష్టత ఇచ్చిన రాహుల్ గాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ కంచుకోటగా పేరున్న అమేఠీ లోక్‌సభ నియోజకవర్గం మరోసారి చర్చల్లో ఉంది. 2019 వరకు వరుస ఎన్నికల్లో 15 ఏళ్ల పాటు కాంగ్రెస్ కైవసం చేసుకుంటున్న ఈ నియోజకవర్గం నుంచి మరోసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేస్తారనే కథనాలు వరుసగా వినిపిస్తున్నాయి. ఇటీవల లోక్‌సభ ఎన్నికల హీట్ మొదలైనప్పటి నుంచి దీనిపై చర్చ కొనసాగుతోంది. రాహుల్ గాంధీ ఇప్పటికే కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి పోటీకి నామినేషన్ కూడా దాఖల్ చేశారు. తాజాగా అమేఠీ నియోజకవర్గానికి సంబంధించి రాహుల్ గాంధీ స్పందించారు. బుధవారం సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ అమేఠీ నుంచి పోటీ చేయాలని ఆలోచిస్తున్నారా అని ప్రశ్నించగా.. దానిపై పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ(సీఈసీ), కాంగ్రెస్ అధ్యక్షుడి ఆదేశాలను తాను అనుసరిస్తాను. ఈ విషయంలో కూడా సీఈసీలో నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఇటీవల ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సైతం అమేఠీపై స్పందించారు. రాహుల్ గాంధీ అమేఠీ నుంచి పోటీ చేయకపోవడం ప్రజల్లో తప్పుడు సందేశాన్ని పంపుతుందని అన్నారు. యూపీ, బీహార్‌, మధ్యప్రదేశ్‌లలో గెలవకపోతే వయనాడ్‌ నుంచి గెలిచినా ప్రయోజనం ఉండదు. వ్యూహాత్మకంగా అమేఠీని వీడడం సరైన నిర్ణయం కాదన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ రాహుల్‌ను ఓడించి అమేఠీ స్థానాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed