మోడీ వర్సెస్ రాహుల్.. లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేతగా రాహుల్‌ గాంధీ పేరును తీర్మానించిన సీడబ్ల్యూసీ

by Prasad Jukanti |   ( Updated:2024-06-08 10:18:53.0  )
మోడీ వర్సెస్ రాహుల్.. లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేతగా రాహుల్‌ గాంధీ పేరును తీర్మానించిన సీడబ్ల్యూసీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేతగా రాహుల్‌గాంధీని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ తీర్మానించింది. ఈ విషయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. ఢిల్లీలో ఇవాళ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన నిర్వహించిన సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొన్న నేతలంతా రాహుల్‌గాంధీకి ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చారని తెలిపారు. ఈ మీటింగ్‌లో చర్చించిన వివరాలను కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్ మీడియాకు వివరించారు. సార్వత్రిక ఎన్నికల క్యాంపెయినింగ్‌లో భాగంగా నిరుద్యోగం, ధరల పెరుగుదల, అగ్నివీర్, మహిళ సమస్యలు, సామాజిక న్యాయం వంటి అనేక అంశాలపై కాంగ్రెస్ పార్టీ సమస్యలను లేవనెత్తిందని.. ఈ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేలా లోక్‌సభలో పోరాటం చేయడానికి రాహుల్‌గాంధీ బెస్ట్ పర్సన్ అని సీడబ్ల్యూసీ భావించిందని చెప్పారు. తాజా రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ప్రజాసమస్యలు, రాజ్యాంగాన్ని రక్షించే భాధ్యతలను రాహుల్ గాంధీ సమర్థవంతంగా నిర్వహిస్తారని సీడబ్ల్యూసీ భావిస్తున్నదని అన్నారు.

ఈరోజు జరిగిన సమావేశంలో లోక్‌సభ ఫలితాలు, ప్రచారం, పథకాల హామీలపై కూలంకషంగా చర్చించామన్నారు. మా బ్యాంకు ఖాతాలను స్థంభింపజేసినా మా నేతలను బ్లాక్ మెయిల్ చేసినా ఎన్నికల్లో అద్భతమైన ప్రదర్శన చేశారని చెప్పారు. ఈ ఎన్నికలు గతానికి పూర్తిగా భిన్నమైనవని, ప్రత్యర్థులతో పాటు మేము ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్‌తోనూ పోరాటం చేయాల్సి వచ్చిందన్నారు. కాంగ్రెస్, ఇండియా కూటమి ఎజెండాను డైవర్ట్ చేసేందుకు బీజేపీ అనేకసార్లు ప్రయత్నించిందని ఆరోపించారు. అయినా రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు ఇండియా కూటమికి అండగా నిలబడిన దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పూర్ ఫెర్మామెన్స్ చేసిన రాష్ట్రాల్లో అధిష్టానం కమిటీలను నియమించి పూర్తిస్థాయి రిపోర్ట్ కోరుతామన్నారు. వయనాడ్, రాయ్‌బరేలి రెండు చోట్ల గెలిచిన రాహుల్‌గాంధీ ఏ సీటును వదులుకుంటారనే దానిపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు.

పీఎం ప్రమాణ స్వీకారానికి మాకు ఆహ్వానం లేదు

ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ పార్టీ హాజరుకావడంపై జైరాం రమేశ్ స్పందించారు. మోడీ ప్రమాణోత్సవానికి అంతర్జాతీయ నేతలకు మాత్రమే ఆహ్వానం అందిందని, మా నేతలకు ఇంకా ఆహ్వానం అందలేదన్నారు. ఇండియా కూటమి నేతలకు ఆహ్వనం అందినప్పుడు హాజరు కావడంపై తాము ఆలోచన చేస్తామన్నారు.

Advertisement

Next Story