- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Private Army : ‘కిరాయి సైన్యం’.. కాంట్రాక్ట్ తీసుకుని సైలెంట్‌గా పని కానిచ్చేస్తారు.. ఇండియాలోనూ!

‘కిరాయి సైన్యం’.. పూర్వం రోమన్ సామ్రాజ్యం నుంచి మన దేశంలోని విజయనగర సామ్రాజ్యం రాజులు సైతం యుద్ధాల్లో ప్రైవేటు సైన్యం సేవలను ఉపయోగించుకున్నారు. ప్రస్తుతం ఆధునిక ప్రపంచంలో ప్రైవేట్ ఆర్మీ సేవలను అగ్రరాజ్యాలు విరివిగా వాడుకుంటున్నాయి. సాధారణంగా అన్ని దేశాలకూ సాంప్రదాయ ఆర్మీ ఉంటుంది. తమ దేశ సరిహద్దులకు రక్షణ కల్పించడం సైన్యం బాధ్యత. టెర్రరిస్టులు, శత్రుదేశాలు ఒకవేళ తమ భూభాగాలపై దురాక్రమణకు పాల్పడినప్పుడు దేశరక్షణ, పౌరుల సేఫ్టీ కోసం వారిని ప్రతిఘటిస్తుంది. ఇక శత్రుదేశాల ఆట కట్టించడానికి సొంత ఆర్మీని వాడి అంతర్జాతీయ భద్రతా చట్టాలను ఉల్లంఘించి చిక్కుల్లో పడే బదులు.. అగ్రరాజ్యాలైన(అమెరికా, రష్యా, బ్రిటన్) ఈ ప్రైవేట్ ఆర్మీ సాయం తీసుకుంటున్నాయి. ఈ కిరాయి సైన్యం కూడా ఆర్మీ బలగాల వలే ప్రత్యేకంగా యుద్ధ కళల్లో శిక్షణ పొంది ఉంటుంది.
-సాయికుమార్ కట్టా
యుద్ధభూమే వారి ప్రపంచం..
కిరాయి సైన్యాలను అగ్రరాజ్యాలు తమ దేశ ప్రయోజనాల కోసం వాడుకుంటుంటాయి. యుద్ధాలు ఎక్కడ జరిగినా ఈ సైన్యాలు అక్కడ వాలిపోతుంటాయి. నిత్యం యుద్ధభూమిలో శత్రువులతో పోరాటాలు చేస్తుంటాయి. కొన్ని ప్రభుత్వేతర(మల్టీనేషనల్) సంస్థలు సైతం వీరి సేవలను వాడుకుంటాయి. చాలా దేశాల్లో ఈ ప్రైవేట్ సైన్యాలు చురుకుగా పనిచేస్తున్నాయి. వీరు శత్రువుల భూభాగంలోకి వెళ్లి సంప్రదాయ ఆర్మీని తలపించేలా ఆపరేషన్స్ చేస్తుంటారు. టార్గెట్‌ను ఫినిష్ చేశాక పై అధికారులకు సమాచారం చేరవేస్తుంటారు. World war-2 తర్వాత యూరప్ ఖండంలోని చాలా దేశాలు ఈ ప్రైవేట్ సైన్యాలపై ఆధారపడ్డాయి. తమ ఆయుధాల తయారీని సైతం ప్రైవేటీకరించాయి.1991లో(Cold War) ప్రచ్ఛన్న యుద్ధం ముగియడంతో ‘యూఎస్, యూకే, రష్యాలు’ తమ సంప్రదాయ ఆర్మీని తగ్గించుకుని ప్రైవేట్ మిలిటరీ కంపెనీలను ఎంకరేజ్ చేశాయి. ఈ ప్రైవేట్ కంపెనీల్లో అధిక భాగం మాజీ సైనిక అధికారుల ఆధ్యర్యంలో నడుస్తుండటం గమనార్హం.
యుద్ధాల్లో ‘పీఎంసీ’ల సంచలనం, ఆపై విమర్శలు!
ప్రైవేట్ మిలిటరీ కంపెనీలు (PMCలు) ప్రైవేట్ యాజమాన్యంలోని సంస్థలు. ఇవి ప్రస్తుతం అనేక యుద్ధ-సంబంధిత సేవలు, కన్సల్టెన్సీలు, నిర్మాణం, లాజిస్టిక్స్, సైనిక శిక్షణ, గూఢచారం, ఎయిర్ కంబాక్ట్, శాంతి పరిరక్షణ వంటి తదితర సేవలను అందిస్తున్నాయి. కాంట్రాక్ట్ కింద సైనిక, భద్రతా సేవలనూ అందిస్తాయి. వీటికి ప్రధానంగా ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు లేదా ప్రైవేట్ కంపెనీలు నిధులను సమకూరుస్తాయి. ఈ పీఎంసీలు ప్రధానంగా మాజీ సైనిక సిబ్బందిని రిక్రూట్ చేస్తాయి. వారికి ఆర్థిక ప్రోత్సాహకాలు, సైనిక పరమైన వాతావరణాన్ని కల్పిస్తాయి. ఈ పీఎంసీల నిర్వహణ, నియంత్రణ నిబంధనలు వివిధ దేశాల మధ్య విభిన్నంగా ఉంటాయి. కొన్ని పారదర్శకత, జవాబుదారీతనం, అంతర్జాతీయ చట్టానికి కట్టుబడి ఉండేలా కఠినమైన పర్యవేక్షణను కలిగి ఉంటాయి. అయినప్పటికీ, కొన్ని పీఎంసీలకు చెందిన సైన్యం చర్యలు మానవ హక్కుల ఉల్లంఘనలకు దారితీశాయి. ఫలితంగా పెద్దఎత్తున విమర్శలను ఎదుర్కొన్నాయి.
టాప్-5 ప్రైవేట్ ఆర్మీ ఏజెన్సీ సంస్థలు..
01. వాగ్నర్ గ్రూప్ :
ఇది రష్యన్ ప్రైవేట్ మిలిటరీ కాంట్రాక్టర్స్ (పీఎంసీ)కి చెందినది. ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో ‘యెవ్‌గోనీ ప్రిగోజిన్’ ఆధ్వర్యంలో ఈ సైన్యం క్రెమ్లిన్ తరఫున యుద్ధం చేసింది. ప్రిగోజిన్.. పుతిన్‌కు సన్నిహితుడు. 2014లో ఈ వాగ్నర్ గ్రూపును పుతిన్ ఏర్పాటు చేశారు. వరల్డ్ వైడ్‌గా రష్యా పూర్వ వైభవాన్ని తిరిగి స్థాపించాలనే ఉద్దేశంతో ‘వాగ్నర్’ను స్థాపించారు. ఈ గ్రూపులోని యోధుల సంఖ్య లక్షదాకా ఉంటుందని అంచనా. ఉక్రెయిన్ దక్షిణ, తూర్పు ప్రాంతంలోని సైనికులపై ఈ ప్రైవేట్ ఆర్మీ విజయాన్ని సాధించింది. 2014లో క్రిమియాను రష్యా ఆక్రమించినప్పుడు కూడా ఈ గ్రూపు ప్రధాన సహకారం అందించింది. అయితే, ప్రిగోజిన్ తిరుగుబాటుతో పుతిన్ ఇరకాటంలో పడ్డారు. ఆ తర్వాత రష్యాలో అంతర్యుద్ధం మొదలైంది. ఆ తర్వాత రష్యన్ ఆర్మీ ప్రిగోజిన్‌ను ఎలిమినేట్ చేయడంతో అంతర్యుద్ధం ఆగిపోయింది. అంతకుముందు సిరియా అంతర్యుద్ధంలోనూ రష్యా తరఫున ఈ ప్రైవేట్ ఆర్మీ ఎన్నో పోరాటాలు చేసింది. సిరియన్ రెబల్స్‌ను అంతమొందించడమే లక్ష్యంగా ఇప్పటికీ అక్కడ పనిచేస్తోంది.
02. అకాడమీ (బ్లాక్ వాటర్) : అమెరికా కోసం పనిచేసే ‘అకాడమీ’ (గతంలో దీన్ని ‘బ్లాక్‌వాటర్’ పేరుతో పిలిచేవారు) దీన్ని మాజీ ‘నేవీ సీల్’ అయిన ఎరిక్ ప్రిన్స్ స్థాపించారు. 2007 సెప్టెంబర్‌లో ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఊచకోత జరిగింది. అమెరికాకు చెందిన ‘బ్లాక్ వాటర్ వరల్డ్ వైడ్’కు సైనికుల పాత్ర అందులో ఉంది. ఇరాక్‌లో భద్రతా సేవల కోసం అమెరికా ‘బ్లాక్ వాటర్’ ప్రైవేట్ ఆర్మీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలోనే ఓ రోజు తమకు ఎదురుగా వస్తున్న వాహనంతో ముప్పు పొంచి ఉన్నట్లు భావించిన బ్లాక్‌వాటర్ సైనికులు.. రద్దీగా ఉండే కూడలిలో కాల్పులు జరిపారు. అక్కడి వాహనాలు, పాదచారులపై విచక్షణారహితంగా కాల్పులు జరపగా 17 మంది ఇరాక్ పౌరులు మరణించగా, అనేక మందికి గాయాలు అయ్యాయి. మృతుల్లో పురుషులతో పాటు మహిళలు, పిల్లలు సైతం ఉన్నారు. ఈ ఘటనపై ఇరాక్ తీవ్ర నిరసన తెలపగా.. అంతర్జాతీయంగా ప్రైవేట్ ఆర్మీపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై అమెరికా విచారణ జరపగా.. బ్లాక్ వాటర్ సైనికులదే తప్పని తేలింది. దీంతో వారిపై అమెరికా న్యాయశాఖ హత్యా నేరాన్ని మోపింది. ఇరాక్‌లో జరిగిన ఈ ఒక్క ఘటన ప్రైవేట్ ఆర్మీ కాంట్రాక్టర్ల పాత్రను తీవ్రంగా హైలైట్ చేసింది.
03. G4S సెక్యూరిటీ : జీ4ఎస్ సెక్యూరిటీ.. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ మల్టీనేషనల్ సెక్యూరిటీ సర్వీసెస్ విభాగం. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో దీనికి సంబంధించిన ప్రైవేట్ ఆర్మీ వివిధ ప్రభుత్వేతర, ఇతర దేశాలకు తమ సేవలను అందిస్తోంది. వాల్‌మార్ట్, ఫాక్స్‌కాన్ వంటి సంస్థలకు రెండవ-అతిపెద్ద ప్రైవేట్ సెక్యూరిటీని అందజేస్తున్నది. దీనిలో దాదాపు 6,20,000 మంది ట్రైన్డ్ సైన్యం ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా 120 దేశాల్లో వీరి కార్యకలాపాలను కలిగి ఉంది. బ్రిటిష్ కంటే మూడు రెట్లు ఎక్కువ సైన్యం దీని సొంతం. ఈ ప్రైవేట్ ఆర్మీ.. విమానాశ్రయ భద్రత, రాత్రిపూట పెట్రోలింగ్ మొదలైన వాటిని నిర్వహిస్తోంది. టెర్రరిస్టుల దాడులు, హైజాకర్ల నుంచి రక్షణ కల్పిస్తుంది. 2008లో G4S ఆర్మర్ గ్రూప్‌ను రీప్లేస్ చేసింది. దీని 9వేల బలమైన గార్డుల సైన్యం ఇరాక్‌లోని సైనికేతర కాన్వాయ్‌లలో మూడింట ఒక వంతుకు రక్షణ కల్పించింది.
04. ఎరినియస్ ఇంటర్నేషనల్ : ‘సౌత్ ఆఫ్రికన్-బ్రిటీష్ జాయింట్’ పీఎంసీ.. ప్రపంచవ్యాప్తంగా ఉండే ‘ఆయిల్ అండ్ గ్యాస్’ కంపెనీలకు ప్రైవేట్ ఆర్మీని అందజేస్తుంది. ఇరాక్ యుద్ధం ప్రారంభం నుంచి ఇది పని చేస్తుండగా.. 280కి పైగా దేశాల్లో ప్రధానంగా యుద్ధానంతరం ఇరాక్‌లో చమురు పైప్‌లైన్‌లు, ఇంధన ఆస్తులను రక్షించడం ఈ ప్రైవేట్ ఆర్మీ యొక్క ప్రాథమిక పని. ఎరినిస్ సైన్యం ఓ అమెరికన్ సైనికుడిని చంపడంతో పాటు కస్టడీలో ఉన్న ఖైదీలను హింసించారని ఆరోపణలు సైతం ఎదుర్కొన్నారు. ఈ పీఎంసీ సైన్యం ఆఫ్రికాలో కూడా ఉంది.
05. డిన్ కార్ప్ : డిన్ కార్ప్ సైతం అమెరికా కేంద్రంగా నడిచే ప్రైవేట్ ఆర్మీ ఏజెన్సీ. అమెరికా ఫెడరల్ ప్రభుత్వ కాంట్రాక్టర్ ‘అమెంటమ్’.. ‘డిన్ కార్ప్’ను-2020లో కొనుగోలు చేసింది. అమెరికా దళాలు ఇరాక్‌లో వైదొలిగినప్పుడు అక్కడ సేవలందించేందుకు యునైటెడ్ స్టేట్స్ ఎంపిక చేసిన 8 ప్రైవేట్ కంపెనీలలో ‘డిన్ కార్ప్’ కూడా ఒకటి. ఇది 10వేల మంది సిబ్బందిని కలిగి ఉంది. దీని సైన్యంలో కొందరు పెరూలో డ్రగ్ డీలర్లు, కొలంబియాలోని తిరుగుబాటుదారులను న్యూట్రలైజ్ చేయడంలో చురుగ్గా పాల్గొన్నారు. నేటికీ ఈ సైన్యం యాక్టివ్‌గా కొనసాగుతోంది.
ప్రైవేట్ సైన్యంతో మానవాళికి చేటు : సీన్ మెక్‌ఫీట్
వాషింగ్టన్ డీసీలోని నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ‘సీన్ మెక్‌ఫీట్’ ఆర్మీలో కొంతకాలం పనిచేశాక.. ఈ ప్రైవేట్ ఆర్మీపై రెండు పుస్తకాలను రాశారు. ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పీఎంసీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.‘1990 దశకంలో కిరాయి సైన్యాల వాడకం మొదలైంది. వీటి నియంత్రణపై ప్రభుత్వాలు తాత్సారం చేస్తున్నాయి. పీఎంసీలను మున్ముందు ఎంకరేజ్ చేస్తే అది అంతర్జాతీయ సంబంధాలపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన రేపు ప్రజలకూ రావొచ్చు. ప్రపంచకుబేరుడు ‘ఎలాన్ మస్క్’ సైతం తన సొంత ఆర్మీని ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ ధోరణి మానవాళికి చేటు చేస్తుంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా అరాచకం విస్తరిస్తుంది’ అని వివరించారు. UNOలోని శాశ్వత సభ్వత్వ దేశాలే ఈ ప్రైవేట్ ఆర్మీని ఎంకరేజ్ చేస్తుండటంతో వాటి నియంత్రణకు కొత్త చట్టాలు ఎవరు చేస్తారని, ఫలితంగా భవిష్యత్‌లో ఏర్పడే ముప్పును అడ్డుకోవడం కష్టసాధ్యంగా మారే చాన్స్ ఉందన్నారు.
ప్రపంచ చరిత్రలో ప్రైవేట్ సైన్యాల పోరాటం..
పూర్వం రోమన్ సామ్రాజ్యంలో 4వ శతాబ్దపు చివరి, 5వ శతాబ్దాల ప్రారంభంలో రోమన్ సైనిక నిర్మాణంలో పెనుమార్పులు సంభవించాయి. కిరాయి సైనికులు, ఫోడెరాటి (నాన్ రోమన్ తెగలు, జర్మన్ తెగల)పై అధికంగా ఆధారపడ్డారు. దీంతో రోమన్ సైనిక వ్యవస్థ క్షీణించింది.కాలక్రమేణా వారి సామ్రాజ్యం అంతరించిపోవడానికి కారణమైంది.ఇక పురాతన గ్రీస్‌లోని ‘ఏథెన్స్, స్పార్టా’ వంటి రాజ్యాలు సైతం తమ సైనిక బలగాల బలోపేతానికి ‘హాప్లైట్స్’ అని పిలిచే కిరాయి సైనికులను తమ సైనికులుగా చేర్చుకున్నాయి. పురాతన ఈజిప్టులోనూ పొరుగు దేశాల నుంచి కిరాయి సైన్యాన్ని ‘ఫారో’ నియమించుకని సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వలసవాద యుగంలో ఈస్ట్ ఇండియా, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా వంటి ప్రైవేట్ సంస్థలు తమ వాణిజ్య ప్రయోజనాల కోసం ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. అమెరికా విప్లవం, అమెరికా రివల్యూషనరీ వార్ టైంలో యూఎస్ వలసవాదులు, బ్రిటిష్ సామ్రాజ్యం కిరాయి సైన్యాన్ని వాడుకుంది. ఇటలీ పునరుజ్జీవనం టైంలో వెనిస్, ఫ్లోరెన్స్ వంటి శక్తిమంతమైన రాజ్యాలు కిరాయి సైన్యాన్ని నియమించుకున్నాయి.
భారత్ విషయానికొస్తే..
భద్రతా వ్యవహారాల నిపుణుడు డాక్టర్ సువ్రోక్మల్ దత్తా రీసెర్చ్ ప్రకారం.. విజయనగర సామ్రాజ్యం సైన్యంలో కొంత ప్రైవేటు సైన్యం ఉండేది. ఇందులో ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, అఫ్గానిస్తాన్, ఇరాన్ వంటి దేశాలకు చెందిన యోధులు ఉండేవారు. వీరికి తగిన ఫీజును చెల్లించేవారు. అహ్మద్‌నగర్ సుల్తానులకు, గోల్కొండ, హైదరాబాద్ నిజాంకు వ్యతిరేకంగా ఈ కిరాయి సైన్యాన్ని విజయనగర సామ్రాజ్య రాజులు బాగా ఉపయోగించేవారని తెలిసింది. ప్రస్తుత తమిళ రాష్ట్రాన్ని ఒకప్పుడు చోళులు పాలించేవారు. వీరు సైతం తమ ‘చోళ సామ్రాజ్య విస్తరణలో భాగంగా మధ్య ఆసియా యోధులతో కూడిన ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది. ఢిల్లీ, మొఘల్ సామ్రాజ్య కాలంలోనూ ప్రైవేట్ సైనికులను వాడుకున్నట్లు ఆనవాళ్లు ఉన్నాయని వెల్లడించారు.
హైదరాబాద్‌లో..
ఏసీ గార్డ్స్ (ఆఫ్రికన్ కావర్లీ గార్డ్స్)
హైదరాబాద్ నగరంలో ఏసీ గార్డ్స్ అనే ప్రాంతం అందరికీ సుపరిచితమే. ఇందులో ఏసీ అంటే ఆఫ్రికన్ అశ్విక దశం. ఆఫ్రికా నుంచి బ్రిటిషర్లు బానిస వర్గమైన సిద్ది ప్రజలను భారత్ కు తీసుకువచ్చారు. వారిలో 300మందిని ఆరో నిజాం మహబూబ్ అలీ ఖాన్ కొనుగోలు చేసి సైనికులుగా ఉద్యోగం ఇచ్చారు. వారు ఉండేందుకు మాసబ్ ట్యాంక్, ఖైరతాబాద్‌కు సమీపంలో ఇచ్చిన స్థలమే ఏసీ గార్డ్స్ అయ్యింది. తన కుటుంబాన్ని కాపాడేందుకు రక్షకులుగా వినియోగించుకున్నారు. హైదరాబాద్ లో తొలి ప్రైవేటు సైన్యంగా చరిత్రకెక్కింది.