మీడియా కథనాల నిషేధంపై సుప్రీంకోర్టు కీలక సూచనలు

by S Gopi |
మీడియా కథనాల నిషేధంపై సుప్రీంకోర్టు కీలక సూచనలు
X

దిశ, నేషనల్ బ్యూరో: రచయిత వాక్ స్వాతంత్య్రానికి, ప్రజల తెలుసుకునే హక్కులు ఎక్కువ ప్రభావితం చేయగల నేపథ్యంలో అసాధారణమైన కేసులను మినహాయించి వార్తా కథనాలను ప్రచురించకుండా న్యాయస్థానాలు నిషేధించకూడదని సుప్రీం కోర్టు పేర్కొంది. మీడియాలో వచ్చే కథనాల కారణంగా తమకు పరువు నష్టం ఉంటుందంటూ దాఖలైన పిటిషన్‌లపై విచారణ జరిగే సమయంలో ట్రయల్ కోర్టులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. యథాలాపంగా అటువంటి కథనాలను నిషేధించవద్దని, ఒకవేళ యాంత్రికంగా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తే రచయిత, పబ్లిషర్ ప్రాథమిక హక్కునే కాకుండా ప్రజలు తెలుసుకునే హక్కును కూడా దెబ్బతీసినట్టేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. జీ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ బ్లూమ్‌బర్గ్ సంస్థలో వచ్చిన కథనాన్ని తొలగించాలని కోర్టును ఆశ్రయించింది. అందులో సదరు కథనాన్ని తొలగించాలని దిగువ కోర్టు ఆదేశాలిచ్చింది. దీనిపై బ్లూమ్‌బర్గ్ మీడియా సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఆ ఉత్తర్వులను కొట్టివేస్తూ, దిగువ కోర్టులకు చీఫ్ జస్టిస్ డి వై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ సూచనలు చేసింది. నిషేధించాలని కోరిన కంటెంట్ 'హానికరమైనది' లేదా 'స్పష్టంగా తప్పుడు వార్తా అని నిర్ధారించకుండా నిషేధం విధించవద్దని తెలిపింది. విచారణ ప్రారంభం కావడానికి ముందు, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం వలన, ప్రజా చర్చను అణచివేయడానికి దారి తీస్తుందని పేర్కొంది.

Advertisement

Next Story