Mohan Bhagwat : ప్రతీ ఫ్యామిలీకి కనీసం ముగ్గురు పిల్లలుండాలి : ఆర్ఎస్ఎస్ చీఫ్

by Hajipasha |
Mohan Bhagwat : ప్రతీ ఫ్యామిలీకి కనీసం ముగ్గురు పిల్లలుండాలి : ఆర్ఎస్ఎస్ చీఫ్
X

దిశ, నేషనల్ బ్యూరో : దేశ జనాభా(Population) ఆందోళనకర స్థితికి పడిపోవద్దంటే కుటుంబాలు కనీసం ముగ్గురు చొప్పున పిల్లలను కలిగి ఉండాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్(Mohan Bhagwat) అభిప్రాయపడ్డారు. ఏదైనా సమాజపు ఉనికి నిలవాలంటే జనాభాపరమైన సుస్థిరత అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మోహన్ భగవత్ ప్రసంగించారు. ‘‘జనాభా తగ్గడం అనేది ఆందోళన కలిగించే అంశం. ఏదైనా వర్గానికి చెందిన సంతానోత్పత్తి రేటు 2.1 కంటే తగ్గిపోతే, దాని ఉనికికే పెను ముప్పు అని ఆధునిక జనాభా అధ్యయనాలు చెబుతున్నాయి. ఈవిధంగా జనాభా తగ్గుతూపోయే వర్గాన్ని శత్రువులు ప్రత్యక్షంగా అంతం చేయాల్సిన అవసరం ఉండదు. జనాభా క్రమంగా తగ్గుతూ దానంతట అదే అంతరించిపోతుంది. ప్రపంచంలోని చాలా భాషలు, సమాజాలు ఈ అంశాన్ని గుర్తించలేక అంతర్ధానం అయ్యాయి. అందుకే మనమంతా సంతానోత్పత్తి రేటు 2.1 కంటే తగ్గకుండా చూసుకోవాలి’’ అని ఆయన వివరించారు. ‘‘మన దేశ జనాభా విధానాన్ని 1998 - 2002 మధ్యకాలంలో రూపొందించారు. దేశంలో ఏ వర్గంలోనూ సంతానోత్పత్తి రేటు 2.1కి తగ్గకుండా చూడాలని అందులో స్పష్టంగా ఉంది. అందుకే ప్రతీ ఫ్యామిలీకి కనీసం ముగ్గురు పిల్లలు ఉండాలి. పాపులేషన్ సైన్సు చెప్పేది కూడా అదే’’ అని మోహన్ భగవత్ గుర్తు చేశారు.

ఇదే మాటను ప్రధాని మోడీకి చెప్పండి : ఒవైసీ

ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలపై మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) ఘాటుగా స్పందించారు. ఎక్కువ మంది పిల్లలను కనే వారి బ్యాంకు ఖాతాలలో ప్రతినెలా రూ.1,500 నుంచి రూ.2,000 దాకా జమ చేసే స్కీంను అమలు చేయాలని బీజేపీ పాలిత రాష్ట్రాలకు మోహన్ భగవత్ సూచించాలన్నారు. ముస్లింలు ఎక్కువ మంది పిల్లల్ని కంటారని విమర్శిస్తున్న ప్రధాని మోడీతోనూ ఆర్ఎస్ఎస్ చీఫ్ ఒకసారి మాట్లాడితే బాగుంటుందని సూచించారు. ‘‘విపక్ష పార్టీలు ఎన్నికల్లో గెలిస్తే.. హిందూ సోదరీమణుల మెడల నుంచి మంగళసూత్రాలను లాక్కొని ఎక్కువ మంది పిల్లల్ని కనే వారికి ఇస్తాయి అని గతంలో ప్రధాని మోడీ చెప్పారు. ఎక్కువ మంది పిల్లల్ని కనేవాళ్లు అంటే ప్రధాని కేవలం ముస్లింలను ఊహించుకుంటున్నారు’’ అని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. ‘‘అల్లా ఆశీస్సులతో నాకు ఆరుగురు సంతానం. నరేంద్ర మోడీకి ఆరుగురు అన్నదమ్ములు ఉన్నారు. అమిత్ షాకు కూడా ఆరుగురు అన్నదమ్ములు ఉన్నారు’’ అని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో విలేకరుల సమావేశంలో ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు.

Next Story