Rahul Gandhi: బిలియనీర్ల కోసం పేదల ప్రయోజనాలు పణంగా పెట్టారు

by Shamantha N |
Rahul Gandhi: బిలియనీర్ల కోసం పేదల ప్రయోజనాలు పణంగా పెట్టారు
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని మోడీ (Naredra Modi)పై లోక్ సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ విమర్శలు గుప్పించారు. జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ప్రచారంలో భాగంగా గొడ్డా జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. పేదల ప్రయోజనాలను పణంగా పెట్టి.. బిలియనీర్ల ప్రయోజనాల కోసమే మోడీ పనిచేస్తున్నారని మండిపడ్డారు.రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ప్రతిపక్ష ఇండియా కూటమి పోరాడుతుంటే, బీజేపీ మాత్రం దాన్ని చెత్తబుట్టలో పడేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ‘‘రాహుల్‌ రెడ్‌బుక్‌ చూపెడుతున్నారని ప్రధాని మోడీ చెబుతున్నారు. దాని రంగు కాదు. కంటెంట్ ముఖ్యం. మీరు దాన్ని చదివి ఉంటే, విద్వేషం వ్యాప్తి చేసి సమాజాన్ని విభజించే ప్రయత్నం చేయరు. ఇది ఇండియా (INDIA) కూటమి, బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ల మధ్య జరుగుతోన్న పోరాటం. కులం, మతం ఆధారంగా సమాజాన్ని విభజించి హింసను వ్యాప్తి చేస్తున్నారు.’’ అని రాహుల్‌ గాంధీ విమర్శించారు.

మోడీపై విమర్శలు

మోడీని ఉద్దేశిస్తూ.. 56 అంగుళాల ఛాతీ కలిగిన వ్యక్తికి తాను భయపడనని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ఆయన సంపన్నులు చెప్పినట్లు వింటారనన్నారు. పగటిపూట పేదల గురించి మాట్లాడుతూ.. రాత్రి సమయాల్లో మాత్రం పారిశ్రామికవేత్తల వివాహాలకు హాజరవుతారని ఆరోపించారు. ఇక మహారాష్ట్రలో భూమిని లాక్కోవడానికే ఉద్ధవ్‌ ప్రభుత్వాన్ని కూల్చివేశారని, ముంబయి ధారావిలో రూ.లక్ష కోట్ల విలువైన భూమిని ఓ పారిశ్రామికవేత్తకు కట్టబెట్టేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. దేశవ్యాప్త కుల గణన అవసరమని వాదించిన రాహుల్ గాంధీ.. ఇది భారతదేశ ముఖచిత్రాన్ని మారుస్తుందని పేర్కొన్నారు. కుల గణన ద్వారా వివిధ సంస్థల్లో గిరిజనులు, దళితులు, ఓబీసీల స్థానాలు వెల్లడవుతాయని చెప్పారు.

Advertisement

Next Story