రూ. 1.25 లక్షల కోట్ల సెమీకండక్టర్ ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంకుస్థాపన

by S Gopi |
రూ. 1.25 లక్షల కోట్ల సెమీకండక్టర్ ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంకుస్థాపన
X

దిశ, నేషనల్ బ్యూరో: 'చిప్స్ ఫర్ వికసిత్ భారత్ ' కార్యక్రమంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం రూ. 1.25 లక్షల కోట్ల విలువైన మూడు సెమీకండక్టర్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. వాటిలో గుజరాత్‌లోని ధోలేరాలో టాటా, పవర్‌చిప్ సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీతో పాటు సనంద్‌లో సీజీ పవర్ అవుట్‌సోర్స్ సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్ట్ ఫెసిలిటీ, అస్సాంలోని మోరిగావ్‌లో అవుట్‌సోర్స్ సెమీకండక్టర్ అసెంబ్లీ టెస్ట్ యూనిట్ ఉన్నాయి. ఈ కార్యక్రమం సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోడీ.. 'మనం ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగులు వేస్తున్నాం. ఈరోజు చారిత్రాత్మకమైన రోజు. చరిత్రను కొత్తగా లిఖిస్తున్నాం. ఉజ్వల భవిష్యత్తు దిశగా బలమైన అడుగులు వేస్తున్నామని ' అన్నారు.

గుజరాత్‌లోని ధోలేరాలో సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీని టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, తైవాన్‌కు చెందిన పవర్‌చిప్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. రూ. 91,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటయ్యే ఈ ఫెసిలిటీలో 28-నానోమీటర్ చిప్‌లను తయారు చేయనున్నారు. దీని ద్వారా ప్రత్యక్ష, పరోక్షంగా 20 వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. గుజరాత్‌లోనే సనంద్‌లో సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్, అవుట్‌సోర్స్ సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్ట్‌ను రూ. 7,500 కోట్లతో ఏర్పాటు చేయనున్నారు. అస్సాంలోని అవుట్‌సోర్స్‌డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్ట్ సదుపాయాన్ని రూ. 27,000 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తుండగా, వీటి ద్వారా సెమీకండక్టర్ తయారీ సామర్థ్యం పెరగడమే కాకుండా ఎలక్ట్రానిక్స్, టెలికాం సంబంధిత రంగాల్లో భారీ ఉపాధి అవాకాశాల సృష్టికి దోహదపడనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed