Pm modi: హింసాత్మక చర్యలు భారత్‌ను బలహీనపర్చలేవు: కెనడాలో దాడిని ఖండించిన మోడీ

by vinod kumar |
Pm modi: హింసాత్మక చర్యలు భారత్‌ను బలహీనపర్చలేవు: కెనడాలో దాడిని ఖండించిన మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: కెనడాలోని ఖలిస్థానీ(kalisthan) మద్దతు దారులు మరోసారి రెచ్చిపోయారు. బ్రాంఫ్టన్ నగరంలోని (Bramftan city) హిందూ మహాసభ ఆలయంపై దాడికి పాల్పడ్డారు. టెంపుల్ ఆవరణలోకి చొరబడి భక్తులపై కర్రలతో విరుచుకుపడ్డారు. మహిళలు, పిల్లలపై కూడా దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. దాడి సమయంలో నిందితులు వారి చేతుల్లో ఖలిస్థానీ జెండాలు పట్టుకుని నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఉద్రిక్తతలు పెరగకుండా ఆ ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించారు. హిందువులపై ఖలిస్థానీలు దాడికి పాల్పడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. భారత్-కెనడాల మధ్య దౌత్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో హిందూ ఆలయంపై దాడి జరగడం కలకలం రేపింది. అయితే, 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిరసన తెలుపుతున్న ఖలిస్థానీలు ఆలయానికి చేరుకుని ప్రజలపై దాడికి పాల్పడినట్టు పలు కథనాలు వెల్లడించాయి.

దాడి ఆమోదయోగ్యం కాదు: ట్రూడో

బ్రాంప్టన్‌లోని హిందూ దేవాలయంపై జరిగిన దాడిపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించారు. హింసాత్మక ఘటన ఆమోదయోగ్యం కాదని తెలిపారు. ‘ప్రతి కెనడియన్‌కు తమకు నచ్చిన మతాన్ని కొనసాగించే హక్కు ఉంది. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించా’ అని వెల్లడించారు. బ్రాంప్టన్ మేయర్ పాట్రిక్ బ్రౌన్ సైతం ఆందోళన వ్యక్తం చేశారు. ‘కెనడాలో మత స్వేచ్ఛ అనేది ఒక ప్రాథమిక హక్కు. ప్రతి వ్యక్తి తమ ప్రార్థనా స్థలంలో సురక్షితంగా ఉండాలి. ఆలయం వెలుపల జరిగిన హింసాత్మక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం. దోషులుగా తేలిన వారిని చట్టం ప్రకారం శిక్షిస్తాం’ అని పేర్కొన్నారు. కెనడాలోని ఖలిస్థానీ తీవ్రవాదులు పరిధులు దాటిపోయారని భారత సంతతి ఎంపీ చంద్ర ఆచార్య అన్నారు. తాజా దాడి.. కెనడాలో ఖలిస్థానీ హింసాత్మక తీవ్రవాదం ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తుందని, భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో కెనడాలో ఖలిస్థానీ వేర్పాటువాదులు దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అలాగే కెనడాలోని ప్రతిపక్షం సైతం దాడిని ఖండించింది.

కెనడియన్ ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఆశిస్తున్నా: ప్రధాని మోడీ

కెనడాలోని హిందూ దేవాలయంపై జరిగిన దాడిని ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించారు. ‘కెనడాలోని హిందూ దేవాలయంపై ఉద్దేశపూర్వక దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఇవి దౌత్యవేత్తలను బెదిరించే పిరికి ప్రయత్నాలు. ఇటువంటి హింసాత్మక చర్యలు భారత్‌ను ఎప్పటికీ బలహీనపర్చలేవు. ఈ విషయంలో కెనడియన్ ప్రభుత్వం న్యాయం చేస్తుందని, చట్ట పాలనను సమర్థిస్తుందని ఆశిస్తున్నా’ అని ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఖలిస్థానీ మద్దతుదారుల తీరుపై ఒట్టావాలోని ఇండియన్ హై కమిషన్ మండిపడింది. విదేశాల్లో ఉన్న భారతీయ పౌరులకు అత్యవసర సేవలు అందకుండా ఇలాంటి చర్యలతో అడ్డుపడుతున్నారని ఫైర్ అయింది. ఈ చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపింది.

హిందూ సంఘాల నిరసన

దాడి అనంతరం కెనడాలోని హిందూ సంఘాలు పలు చోట్ల నిరసనలు తెలిపాయి. ఉత్తర అమెరికా హిందువుల కూటమి (COHNA) బ్రాంప్టన్, సర్రేలోని లక్ష్మీ నారాయణ ఆలయం వద్ద శాంతియుతంగా నిరసన తెలిపింది. హిందువులంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చింది. ది హిందూ కెనడియన్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొంది. బ్రాంప్టన్‌లోని హిందూ సభా దేవాలయంలో హింసకు పాల్పడిన వేర్పాటువాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ డిమాండ్ చేశారు.

Advertisement

Next Story