- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
PM Modi : 21 నుంచి ప్రధాని మోడీ విదేశీ పర్యటన.. టాప్ పాయింట్స్
దిశ, నేషనల్ బ్యూరో : ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈనెల 21, 22, 23 తేదీల్లో పోలాండ్, ఉక్రెయిన్ దేశాల్లో పర్యటించనున్నారు. బుధ, గురువారాల్లో (ఆగస్టు 21, 22) ఆయన పోలాండ్ సందర్శనలో ఉంటారు. 45 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పోలాండ్ సందర్శనకు వెళ్తున్న తొలి భారత ప్రధాని మోడీయే కావడం విశేషం. భారత్- పోలాండ్ మధ్య దౌత్యపరమైన సంబంధాలు 1940వ దశకం నుంచే ఉన్నాయి. ఇరుదేశాల దౌత్య సంబంధం 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగానే ఇప్పుడు పోలాండ్ పర్యటనకు భారత ప్రధాని వెళ్తున్నారు. పర్యటనలో భాగంగా పోలాండ్ ప్రధానమంత్రి డొనాల్డ్ టస్క్‌తో మోడీ భేటీ అవుతారు. అక్కడి భారతీయులతో సమావేశమై ప్రసంగిస్తారు. పోలాండ్‌లో దాదాపు 25వేల మంది భారతీయులు ఉన్నారు. 1940వ దశకంలో రెండో ప్రపంచ యుద్ద కాలంలో పోలాండ్‌కు చెందిన 6వేల మంది మహిళలు, పిల్లలకు భారత్‌లోని జామ్‌నగర్, కొల్హాపూర్ సంస్థానాలు ఆశ్రయం కల్పించాయి.
శాంతి చర్చలే ఏకైక మార్గం..
ఆగస్టు 23న ఉక్రెయిన్‌కు ప్రధాని మోడీ చేరుకుంటారు. ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీతో ఈసందర్భంగా ఆయన భేటీ అవుతారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ప్రధాని మోడీ ఉక్రెయిన్ పర్యటనకు వెళ్తుండటం ఇదే తొలిసారి. రష్యా-ఉక్రెయిన్ యుద్దం ఆగాలంటే శాంతి చర్చలు మాత్రమే ఏకైక మార్గమని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఆ దిశగా భారత్ తప్పకుండా ప్రయత్నాలు చేస్తుందని పేర్కొంది. ‘‘భారత్‌కు రష్యా, ఉక్రెయిన్ రెండు దేశాలతోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. ఇరుపక్షాలు రాజీకి వస్తేనే శాంతి సాధ్యం అవుతుంది. భారత్ ఇరుపక్షాలను రాజీకి తెచ్చే ప్రయత్నం చేస్తుంది’’ అని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ప్రధాని పర్యటించే రోజున (ఆగస్టు 23న) ఉక్రెయిన్ నేషనల్ ఫ్లాగ్ డే ఉంది. భారత ప్రధాని ఉక్రెయిన్‌లో పర్యటిస్తుండటం ఇదే తొలిసారి. ఈసందర్భంగా ఉక్రెయిన్, భారత్ పలు కీలక ఒప్పందాలను కుదుర్చుకోనున్నట్లు తెలుస్తోంది.
ప్రధాని మోడీతో నేపాల్ విదేశాంగ మంత్రి భేటీ
నేపాల్ విదేశాంగ మంత్రి ఆర్జు రాణా డ్యూబా సోమవారం భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీని గౌరవపూర్వకంగా కలిశారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ఈసందర్భంగా వారు చర్చించారు. నేపాల్ పర్యటనకు రావాలంటూ ప్రధానమంత్రి కె.పి.శర్మ ఓలి పంపిన ఆహ్వాన లేఖను భారత ప్రధానికి అందించారు. నేపాల్ విదేశాంగ మంత్రి ఈనెల 22 వరకు భారత్‌లో పర్యటించనున్నారు. అంతకుముందు ఆర్జు రాణా డ్యూబా భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో భేటీ అయ్యారు. వాణిజ్య, ఇంధన, మౌలిక సదుపాయాల రంగాల్లో ఇరుదేశాల భాగస్వామ్యంపై వారు చర్చించారు.