PM Modi: ఫిబ్రవరి 5న మహా కుంభమేళకు ప్రధాని మోదీ

by D.Reddy |
PM Modi: ఫిబ్రవరి 5న మహా కుంభమేళకు ప్రధాని మోదీ
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళ జరుగుతున్న సంగతి తెలిసిందే. దేశ విదేశాల నుంచి ఎంతో మంది భక్తులు ఈ వేడుకలో పాల్గొని గంగా, యమునా, సరస్వతీ నదుల త్రివేని సంగమంలో పుణ్యస్నానాలను ఆచరిస్తున్నారు. ఈ సందర్భంగా ఈనెల 5న భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) మహా కుంభమేళాను సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని రాక కోసం యూపీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రధాని మోదీ బుధవారం ఉయదం 10:30 గంటలకు ప్రయాగ్ రాజ్ చేరుకుని అరయిల్ ఘాట్‌లో పవిత్ర స్నానం చేయనున్నారు. అనంతరం మోదీ అక్కడి అఖాడాలతో భక్తులతో సంభాషించనున్నారు. అనంతరం 2025 మహాకుంభ్ కోసం నిర్వహించిన ఏర్పాట్లను పరిశీలిస్తారు. కాగా, 2019లో ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన అర్థ కుంభమేళాలో పాల్గొన్న ప్రధాని మోదీ అక్కడి పారిశుధ్య కార్మికుల పాదాలను కడిగి, సామాజిక సామరస్య సందేశాన్ని అందించారు.

ఇక జనవరి 13న పుష్య పౌర్ణిమ రోజు ప్రారంభమైన మహా కుంభ మేళా.. మహా శివరాత్రి (ఫిబ్రవరి 26) వరకు కొనసాగనుంది. గత 20 రోజుల్లో ఏకంగా 33.6 కోట్ల మంది భక్తులు వచ్చినట్లు యూపీ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కేవలం వసంత పంచమి ఒక్క రోజు రెండు కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు తెలిపాయి. అలాగే, రథ సప్తమి, భీష్మష్టమి, భీష్మాకాదశి, మాఘ పౌర్ణమి వంటి పర్వదినాలు వస్తుండటంతో ఆ రోజుల్లో మరింతగా భక్తుల రద్దీ పెరిగే అవకాశమున్నట్లు పేర్కొన్నాయి.

Next Story