Pm modi: ప్రతిపక్షాలు పౌరులను తప్పుదోవ పట్టిస్తున్నాయి.. ప్రధాని మోడీ

by vinod kumar |
Pm modi: ప్రతిపక్షాలు పౌరులను తప్పుదోవ పట్టిస్తున్నాయి.. ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రతిపక్షాలు దేశ పౌరులను తప్పుదోవ పట్టిస్తు్న్నాయని ప్రధాని నరేంద్ర మోడీ(Narendra modi) ఆరోపించారు. బీజేపీపై కోపంతో దేశానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. వారంతా అధికారం అనే ఆకలిలో ఉన్నారని విమర్శించారు. ఒడిశా(Odisha) రాజధాని భువనేశ్వర్‌ (Bhuvaneshwar)లో శుక్రవారం నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మోడీ ప్రసంగించారు. నేను సీఎంగా, ప్రధానిగా పనిచేస్తు్న్నప్పుడు రకరకాల రాజకీయాలను చూశానని, పాలిటిక్స్‌లో విధాన వ్యతిరేకత చాలా సహజమని అంగీకరిస్తున్నట్టు చెప్పారు. ఏ నిర్ణయానికైనా భిన్నమైన అభిప్రాయాలు ఉండొచ్చని స్పష్టం చేశారు. ఎవరైనా రాజ్యాంగ బద్దంగా తమ అభిప్రాయాలను వెల్లడించొచ్చని తెలిపారు.

‘గత కొంత కాలంగా ప్రజలు దేశంలో పెద్ద మార్పును చూశారు. కానీ అధికారం తమ జన్మహక్కుగా భావించే వారికి దశాబ్ద కాలంగా కేంద్రంలో అధికారం లేదు. మొదటి రోజు నుంచి మరొకరిని ఆశీర్వదించినందుకు వారు దేశ ప్రజలపై కోపంగా ఉన్నారు’ అని తెలిపారు. అందుకే వారంతా దేశానికి వ్యతిరేకంగా కుట్రలు చేయడంలో బిజీగా ఉన్నారని ఫైర్ అయ్యారు. ప్రజలను నిరంతరం తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. ‘వారి అబద్ధాల దుకాణం 50-60 ఏళ్లుగా నడుస్తోంది. ఇప్పుడు ఈ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. అలాంటి పరిస్థితుల్లో దేశాన్ని ప్రేమించే వారికి, రాజ్యాంగాన్ని గౌరవించే వారికి అలాంటి వ్యక్తుల చర్యలు, పెద్ద సవాలుగా మారుతున్నాయి’ అని వ్యాఖ్యానించారు. కాబట్టి ప్రజలు ప్రతీక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Advertisement

Next Story