PM Modi: థాయిలాండ్ ప్రధానితో మోడీ భేటీ.. కీలక అంశాలపై డిస్కషన్

by vinod kumar |
PM Modi: థాయిలాండ్ ప్రధానితో మోడీ భేటీ.. కీలక అంశాలపై డిస్కషన్
X

దిశ, నేషనల్ బ్యూరో: రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోడీ (Narendra modi) గురువారం థాయిలాండ్ (Thailand) చేరుకున్నారు. మొదట బ్యాంకాక్ చేరుకున్న ప్రధాని మోడీకి గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. ఆ తర్వాత ప్రవాస భారతీయులను కలిసి థాయ్ రామాయణ ప్రదర్శనను వీక్షించారు. అనంతరం భారత ప్రతినిధి బృందంతో కలిసి థాయిలాండ్ ప్రధాని షిటోంగ్‌టార్న్ షినవత్రా (Shinavathra) తో భేటీ అయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. పలు అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకున్నారు. సమావేశం అనంతరం షినవత్రా, మోడీలు సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలు, థాయిలాండ్ మధ్య పర్యాటకం, సంస్కృతి, విద్యా రంగాల్లో సహకారానికి ప్రాధాన్యత ఉందన్నారు. భారతదేశ యాక్ట్ ఈస్ట్ పాలసీ, ఇండో-పసిఫిక్ దార్శనికతలో థాయిలాండ్‌కు ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. రెండు దేశాల మధ్య శతాబ్దాల నాటి లోతైన సంబంధాలున్నాయని చెప్పారు.

ఇరు దేశాల సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. మోడీ పర్యటనకు జ్ఞాపకంగా 18వ శతాబ్దపు రామాయణ కుడ్య చిత్రాల ఆధారంగా ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేయగా అందుకు థాయిలాండ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారికి మోడీ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా, బిమ్‌స్టెక్ కూటమి నాయకులతో కలిసి మోడీ సముద్ర సహకార ఒప్పందాలను పర్యవేక్షించనున్నారు. అలాగే థాయిలాండ్ పర్యటన అనంతరం మోడీ శ్రీలంక (Srilanka)కు వెళ్లనున్నారు.



Next Story