నెహ్రు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను వ్యతిరేకించారు: ప్రధాని మోడీ

by S Gopi |   ( Updated:2024-05-21 13:39:30.0  )
నెహ్రు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను వ్యతిరేకించారు: ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు ముగింపు దశకు చేరుకుంటున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్‌పై, భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నేహ్రూపై మరోసారి విమర్శలు చేశారు. నెహ్రూ అణగారిన కులాలకు రిజర్వేషన్లను వ్యతిరేకించారని తెలిపారు. మంగళవారం బీహార్‌లోని మోతీహరిలో జరిగిన ర్యాలీలో ప్రసంగించిన మోడీ.. బాబా సాహెబ్ అంబేడ్కర్ లేకుంటే నెహ్రూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు ఎన్నటికీ అంగీకరించేవాడు కాదని, నెహ్రూ దీనిపై తన అభిప్రాయాలను అప్పట్లో ముఖ్యమంత్రులకు రాసిన లేఖల్లో స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాంలో ఉన్న ప్రధానమంత్రులందరి లక్షణం ఇదే. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ కావచ్చు, వారంతా రిజర్వేషన్లను వ్యతిరేకించారు. ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు ఎన్నడూ కాంగ్రెస్ నుంచి గౌరవం పొందలేదని ఆరోపణలు చేశారు. ప్రస్తుతం బీజేపీ అధిక మెజారిటీతో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని మార్చడం ద్వారా రిజర్వేషన్లను రద్దు చేస్తుందని అబద్దపు ప్రచారం కాంగ్రెస్ చేస్తోందన్నారు. నిజానికి మేము అణగారిన కులాల హక్కులను పరిరక్షిస్తున్నాం. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేతోనే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కులు సురక్షితంగా ఉంటాయని మోడీ పేర్కొన్నారు. పార్లమెంటు పనితీరుకు అడ్డంకులు సృష్టించే కాంగ్రెస్ ఎన్నికల కమిషన్‌ను, ఈవీఎంలను ప్రశ్నిస్తారు. ఇప్పుడు వారి ఓటు బ్యాంకు కోసం రాజ్యాంగాన్ని కూడా అవమానిస్తున్నారని మోడీ విమర్శలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed