భారత్ అంటే 100 కోట్ల మెదళ్లు.. 200 కోట్ల చేతులు : ప్రధాని మోదీ

by Shiva |   ( Updated:2023-09-03 11:44:30.0  )
భారత్ అంటే 100 కోట్ల మెదళ్లు.. 200 కోట్ల చేతులు : ప్రధాని మోదీ
X

అంతర్జాతీయ సమాజం దేశాన్ని చూసే తీరు మారింది

ఒకప్పుడు 100 కోట్ల ఆకలి కడుపులే కనిపించేవి

తొమ్మిదేళ్ల రాజకీయ స్థిరత్వానికి బోనస్ గా అభివృద్ధి ఫలాలు లభిస్తున్నాయని వ్యాఖ్య

న్యూఢిల్లీ : దేశంలో అవినీతి, కుల, మత తత్వాలకు స్థానం ఉండదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. జీడీపీ ధృక్కోణంలో చూడడం నుంచి.. మానవీయ దృక్కోణంలో చూసే దిశగా ప్రపంచం వైఖరి మారుతోందని ఆయన పేర్కొన్నారు. జీ20 కూటమికి ఈ ఏడాది భారత్ నాయకత్వం వహించడం వల్ల పేద దేశాల్లో ఆత్మ విశ్వాసం పెరిగిందన్నారు. ‘వసుధైవ కుటుంబం అనేది ఒక స్లోగన్‌ కాదు. అది మన సాంస్కృతిక విలువల నుంచి నడిపించిన సమగ్ర తత్వం’ అని పేర్కొన్నారు.

ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. 2047 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ సంక్షేమానికి ‘సబ్‌కా సాత్‌.. సబ్‌కా వికాస్‌’ మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. ఈసారి జరగనున్న జీ20లో ఆఫ్రికాకు అత్యధిక ప్రాధాన్యత దక్కేలా భారత్ ప్రయత్నాలు చేస్తోందని పేర్కొన్నారు. కశ్మీర్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌లో జీ20 సదస్సు నిర్వహించడంపై చైనా, పాక్‌ దేశాలు లేవనెత్తిన అభ్యంతరాలను మోదీ కొట్టిపాడేశారు. దేశంలోని ప్రతి భాగంలో జీ20 కార్యక్రమాలు నిర్వహించడం సర్వసాధారణమన్నారు.

'ఒకప్పుడు అంతర్జాతీయ సమాజం భారత్‌ను 100 కోట్ల ఆకలి కడుపులుగా చూసేది. కానీ, ఇప్పుడు ఆకాంక్షలతో నిండిన 100 కోట్ల మెదళ్లుగా.. నైపుణ్యంతో కూడిన 200 కోట్ల చేతులుగా చూస్తున్నారు' అని ప్రధాని వ్యాఖ్యానించారు. గత తొమ్మిదేళ్లుగా దేశంలో ఏర్పడిన రాజకీయ స్థిరత్వం వల్లే పలు సంస్కరణలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. అభివృద్ధి అనేది రాజకీయ స్థిరత్వానికి లభించిన బోనస్‌ మాత్రమేనని కామెంట్ చేశారు. చర్చలు, సంప్రదింపులతోనే రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ సంక్షోభానికి పరిష్కారం లభిస్తుందన్నారు.



Next Story

Most Viewed