నీటి ప్రాజెక్టులపై నిధుల వినియోగం సరిగా లేదు

by John Kora |
నీటి ప్రాజెక్టులపై నిధుల వినియోగం సరిగా లేదు
X

- కేటాయించిన బడ్జెట్‌లో 58 శాతమే వినియోగం

- వాటర్ మేనేజ్‌మెంట్‌కు రూ.850 కోట్ల మేర తగ్గింపు

- పార్లమెంటరీ ప్యానెల్ ఆందోళన

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా నీటి ప్రాజెక్టులపై నిధులను వినియోగించడంపై పార్లమెంటరీ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో జల వనరులు, నదుల అభివృద్ధి, గంగా పునరుజ్జీవనంపై రూ.21,640.88 కోట్లు కేటాయించగా.. అందులో 58 శాతం మాత్రమే గతేడాది డిసెంబర్ వరకు ఉపయోగించినట్లు పార్లమెంటరీ ప్యానల్ పేర్కొన్నది. ఈ క్రమంలో నిధుల వినియోగంపై పర్యవేక్షణ, అమలు విధానాన్ని బలోపేతం చేయాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖను పార్లమెంటరీ ప్యానల్ కోరింది.

ఇటీవల పార్లమెంటులో పార్లెమెంటరీ ప్యానల్ ప్రవేశపెట్టిన నివేదిక ప్రకారం జలవనరుల కోసం కేటాయించిన బడ్జెట్‌లో 40 శాతం మేర ఖర్చు కాకుండానే ఉండిపోయాయని.. నిధుల పంపిణీలో, ప్రాజెక్టు అమలులో ఇవి ప్రభావం చూపాయని ఆ నివేదికలో పేర్కొన్నారు. కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ కిందకు వచ్చే కీలక పథకాలకు బడ్జెట్‌ కేటాయించడంలో గణనీయమైన పెరుగుదలను ఈ నివేదికలో హైలైట్ చేశారు. ఇక 2025-26లో కేంద్ర జల శక్తి శాఖకు రూ.25,276.83 కోట్ల మేర బడ్జెట్ పెంచారు. ఇది గతేడాది కంటే 18 శాతం మేర ఎక్కువ.

కాగా, కేంద్ర జలశక్తి శాఖ పెరిగిన బడ్జెట్‌ను భూగర్భ జల నిర్వహణ, నదీ పరివాహక అభిృవృద్ధి, పోలవరం నీటి పారుదల ప్రాజెక్టులకు కేటాయింపులు చేసినట్లు పేర్కొన్నది. మరోవైపు భూగర్భ జల నిర్వహణ, నియంత్రణకు 56.61 శాతం మేర కేటాయింపులు పెంచారు. ఇది దాదాపు రూ.509 కోట్లకు చేరుకున్నాయి. ఇక ఈశాన్య ప్రాంతంలో వరద నివారణ, నియంత్రణ కోసం రూ.243 కోట్లు కేటాయించారు. మరోవైపు బ్రహ్మపుత్ర బోర్డు 15 ఉప-బేసిన్‌లకు మాస్టర్ ప్లాన్‌లను సిద్దం చేయడానికి కేంద్ర జల శక్తి శాఖ చొరవ తీసుకోనున్నట్లు తెలిసింది. నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్ట్ కోసం 2024-25లో రూ.661 కోట్ల మేర ఉన్న బడ్జెట్.. 2025-26లో రూ.13 కోట్ల మేర తగ్గించినట్లు తెలిపింది.

ఏపీలోని పోలవరం నీటి పారుదల ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిని కూడా పార్లమెంటరీ ప్యానల్ పరిశీలించింది. 2025-26లో పోలవరానికి రూ.5,936 కోట్లు కేటాయించారు. అయితే నిరుడు ఇది రూ.5,512 కోట్లుగా ఉన్నట్లు ప్యానల్ పేర్కంది. మొత్తంగా నీటి ప్రాజెక్టులకు నిధులను గణనీయంగా తగ్గించినట్లు చెప్పింది.

Next Story