ONOE: సోమవారం లోక్‌సభకు జమిలి బిల్లులు.. బిల్లులోని ముఖ్యాంశాలివే!

by Mahesh Kanagandla |
ONOE: సోమవారం లోక్‌సభకు జమిలి బిల్లులు.. బిల్లులోని ముఖ్యాంశాలివే!
X

దిశ, నేషనల్ బ్యూరో: జమిలి(simultaneous Elections) బిల్లులను కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్‌సభ(Lok Sabha)లో ప్రవేశపెట్టనుంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్(Arjun Ram Meghwal) ఈ బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెడుతారు. ఇప్పటికే సభ ముందుకు ఈ రెండు బిల్లుల కాపీలు తీసుకువచ్చారు. రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలోని ఉన్నతస్థాయి కమిటీ నివేదిక ఆధారంగా జమిలి ఎన్నికల ప్రణాళికను అమలు చేయడానికి మూడు బిల్లుల ముసాయిదాలను సిద్ధం చేయగా.. గురువారం కేంద్ర కేబినెట్ రెండు బిల్లులకు ఆమోదం తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికలనూ జమిలి ఎన్నికల ప్రక్రియలో కలిపే రాజ్యాంగ సవరణ బిల్లును పెండింగ్‌లో పెట్టింది. తాజాగా, కేంద్రమంత్రి వర్గం ఆమోదం తెలిపిన రెండు బిల్లుల(రాజ్యాంగ (129వ సవరణ) బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాలు (సవరణ) బిల్లు 2024)ను లోక్‌సభ ముందు పెట్టింది.

అపాయింటెడ్ డేట్:

లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించడానికి సంబంధించిన రాజ్యాంగ (129వ సవరణ) బిల్లు వివరాల్లో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. 81 ఆర్టికల్‌లో 82(ఏ) చేర్చనున్నారు. ఇది అపాయింటెడ్ డేట్‌ను నిర్ణయిస్తుంది. ఈ డేట్ నుంచి చట్టసభల గడువు(ఐదేళ్లు) మొదలవుతుంది. జనరల్ ఎన్నికలు పూర్తయ్యాక చట్టసభ తొలి సమావేశం నిర్వహించే రోజున రాష్ట్రపతి నోటిఫికేషన్ విడుదల చేసి ఈ మార్పులను అమల్లోకి తెస్తారు. ఇక ఆర్టికల్ 83, 172 సవరణలతో అపాయింటెడ్ డేట్‌కు ముందు ఎన్నికలు జరిగి ఏర్పడ్డ అసెంబ్లీలు, అలాగే ఇంకా పూర్తి కాని చట్టసభల గడువు.. లోక్ సభ గడువుతో ముగుస్తాయి. లోక్‌సభ గడువు ముగియకముందే ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించాలి. లోక్‌సభకు జమిలిగా అసెంబ్లీ ఎన్నికలు ఇతర మార్పులకు లోబడి నిర్వహించాలి. అలాగే.. ఏదైనా ఒక అసెంబ్లీకి లోక్‌సభతోపాటుగా ఎన్నికలు నిర్వహించలేని పక్షంలో ఆ అసెంబ్లీకి ఎన్నికలు తర్వాతి తేదీల్లో నిర్వహిస్తామని రాష్ట్రపతితో ఆదేశాలు జారీ చేయడానికి ఎన్నికల సంఘం సిఫార్సులు చేయాలి. సదరు అసెంబ్లీ గడువు లోక్‌సభ గడువుతోనే ముగుస్తుంది. లోక్‌సభ తొలి సమావేశమైన తేదీ మొదలు ఐదేళ్లకాలాన్ని ఫుల్ టర్మ్‌గా పరిగణించాలి.

లోక్‌సభకు సంబంధించి..

ఆర్టికల్ 83లో క్లాస్ (2)ను చేర్చి కొన్ని సవరణలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వీటి ప్రకారం, ఒక వేళ లోక్‌సభ గడువు ముందుగా రద్దయితే.. ఐదేళ్లలో మిగిలిన కాలాన్ని అన్‌ఎక్స్‌పైర్డ్‌ కాలంగా గుర్తించాలి. ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించి కొత్త లోక్‌సభను ఎన్నుకున్నా.. ఆ సభ గడువు ఈ అన్‌ఎక్స్‌పైర్డ్ కాలం మేరకే ఉంటుంది. ఆ తర్వాత సభ గడువు ముగిసినట్టుగా పరిగణించాలి. లోక్‌సభ రద్దయిన తర్వాత నిర్వహించే ఎన్నికలను మధ్యంతర ఎన్నికలు, లోక్‌సభ గడువు పూర్తయిన తర్వాత నిర్వహించే ఎన్నికలను జనరల్ ఎలక్షన్స్‌గా పరిగణించాలి.

అసెంబ్లీలకు సంబంధించి..

172 ఆర్టికల్‌లో సబ్ క్లాజులను చేర్చి అసెంబ్లీలకు సంబంధించి కేంద్రం సవరణలు చేయనుంది. అసెంబ్లీ తొలి సమావేశం నుంచి ఐదేళ్ల కాలాన్ని ఫుల్ టర్మ్‌గా పరిగణించాలి. ఒక వేళ అసెంబ్లీ ముందస్తుగా రద్దయితే.. ఆ ఐదేళ్ల గడువులో మిగిలిన కాలాన్ని అన్‌ఎక్స్‌పైర్డ్ టర్మ్‌గా భావించాలి. అసెంబ్లీ రద్దు తర్వాత నిర్వహించిన ఎన్నికల్లో ఏర్పడ్డ కొత్త అసెంబ్లీ ఈ అన్‌ఎక్స్‌పైర్డ్ టర్మ్ కాలం వరకే కొనసాగుతుంది. ఆ తర్వాత అసెంబ్లీ రద్దవుతుంది.

Advertisement

Next Story

Most Viewed