NEET UG :‘నీట్‌ - యూజీ’ రివైజ్డ్‌ ఫలితాలు.. 5 మార్కులు కోల్పోయిన 4.2 లక్షల మంది

by Hajipasha |   ( Updated:2024-07-25 12:40:18.0  )
NEET UG :‘నీట్‌ - యూజీ’ రివైజ్డ్‌ ఫలితాలు.. 5 మార్కులు కోల్పోయిన 4.2 లక్షల మంది
X

దిశ, నేషనల్ బ్యూరో : ‘నీట్‌ - యూజీ’ పరీక్ష రివైజ్డ్‌ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) గురువారం విడుదల చేసింది. సవరించిన ఫలితాలను ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌ exams.nta.ac.inలో అందుబాటులో ఉంచింది. ఐఐటీ ఢిల్లీ నిపుణుల కమిటీ నివేదిక ప్రకారం.. నీట్-యూజీ ప్రశ్నాపత్రంలోని అటామిక్‌ థియరీకి సంబంధించిన 29వ ప్రశ్నకు సమాధానంగా ‘ఆప్షన్‌ 4’ను టిక్ చేసిన వారికే ఈసారి మార్కులను కేటాయించాారు. ఈ మార్పుతో 4.2లక్షల మంది అభ్యర్థులు 5 మార్కులు చొప్పున కోల్పోయారు. కట్ అయిన ఈ ఐదు మార్కుల్లో.. ప్రశ్నకు సంబంధించిన నాలుగు మార్కులు, తప్పుగా రాసినందుకు పెనాల్టీగా విధించే ఒక నెగెటివ్‌ మార్క్‌ ఉన్నాయి. 720కి 720 స్కోరు సాధించిన 61 మందిలో ఈ ప్రశ్నకు మార్కులు పొందిన వారు 44 మంది ఉన్నట్లు గుర్తించారు. 29వ ఆన్సర్ తప్పుగా రాయడంతో వారిలో చాలామంది స్కోరు తగ్గిపోయి.. టాప్‌ ర్యాంకర్ల సంఖ్య 61 నుంచి 17కు తగ్గిపోయింది. వెరసి, మొత్తం మెరిట్‌ లిస్ట్‌ మారిపోయింది.

రిజల్ట్స్‌ను ఎందుకు రివైజ్ చేశారు ?

నీట్- యూజీ పరీక్షల్లో అవకతవకలపై దాఖలైన 40కిపైగా పిటిషన్లను ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారిస్తోంది. ఈక్రమంలో మే 5న జరిగిన నీట్-యూజీ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రంలోని ఫిజిక్స్‌ విభాగంలో ఉన్న అటామిక్‌ థియరీకి సంబంధించిన 29వ ప్రశ్నపై ఓ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘ఒక ప్రశ్నకు ఒకే జవాబు ఉండాలి. కానీ 29వ ప్రశ్నకు రెండు సమాధానాలను ఎన్‌టీఏ కన్ఫార్మ్ చేసింది. దీనివల్ల ఆ రెండింటిలో ఏదో ఒకటి టిక్ చేసిన వారికి చెరో నాలుగు మార్కులు వచ్చాయి. అయితే నెగెటివ్ మార్కింగ్ భయంతో ఆ ప్రశ్నకు సమాధానం రాయకుండా వదిలేసిన నా లాంటి అభ్యర్థులకు నష్టం జరిగింది’’ అని సదరు అభ్యర్థి కోర్టుకు తెలిపాడు. దీంతో ఆ ప్రశ్నకు సరైన సమాధానమేదో తేల్చాలని ఐఐటీ ఢిల్లీని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఐఐటీ ఢిల్లీ నియమించిన ముగ్గురు నిపుణుల కమిటీ.. 29వ ప్రశ్నకు ‘ఆప్షన్ 4’ సరైన సమాధానమని తేల్చింది. దీంతో ఆప్షన్‌ 4ను ఎంచుకున్న అభ్యర్థులకు మాత్రమే మార్కులు ఇవ్వాలని ఎన్‌టీఏకు సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు మార్పుతో సవరించిన నీట్-యూజీ రిజల్ట్స్‌ను ఎన్‌టీఏ తాజాగా రిలీజ్ చేసింది.

Advertisement

Next Story