Delhi liquor scam case:.. ఐదు న్యూస్ చానెళ్లకు నోటీసులు!

by Nagaya |   ( Updated:2022-11-21 12:49:02.0  )
Delhi liquor scam case:.. ఐదు న్యూస్ చానెళ్లకు నోటీసులు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ మద్యం పాలసీ ముడుపుల వ్యవహారం కేసులో జరుగుతున్న విచారణ సమాచారాన్ని దర్యాప్తు సంస్థలు మీడియాకు లీక్ చేస్తోందన్న పిటిషన్ పై సోమవారం ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో తప్పుడు కథనాలు ప్రసారం చేసినందుకు ఐదు టీవీ న్యూస్ చానళ్లకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణకు సంబంధించిన సమాచారం మీడియాకు లీకుల ద్వారా అందజేస్తున్నారని, దర్యాప్తు సంస్థలు కావాలని ఇదంతా చేస్తున్నాయని ఈడీ కస్టడీలో ఉన్న ఆప్ మీడియా కోఆర్డినేటర్ విజయ్ నాయర్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సింగిల్ జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ బెంచ్ విచారించింది. ఈ కేసుకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ఈడీ, సీబీఐ మీడియాకు లీక్ చేశాయని తద్వారా నిందితుడిగా తన హక్కులకు భంగం కలుగుతోందని విజయ్ నాయర్ తన పిటిషన్ లో పేర్కొన్నాడు.

దర్యాప్తు సంస్థలు తనను ఏ ప్రశ్నలు అడిగారో వాటికి తాను ఏం సమాధానాలు చెప్పానో అనే విషయాలను కొన్ని మీడియా సంస్థలు తమ కథనాల్లో ప్రస్తావించారని పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఈడీ ఇప్పటి వరకు ఎలాంటి పత్రికా ప్రకటన విడుదల చేయలేదని, సీబీఐ మాత్రం ఇప్పటి వరకు మూడు పత్రికా ప్రకటనలు విడుదల చేసిందని విచారణ సందర్భంలో ఈడీ ఢిల్లీ హైకోర్టుకు వివరించింది. విజయ్ నాయర్ గురించి వచ్చిన మీడియా కథనాలు దర్యాప్తు సంస్థ ప్రకటనల ఆధారంగా లేవని సీబీఐ, ఈడీ ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకువచ్చాయి. దీంతో మీడియా చానెల్స్ చేసిన రిపోర్టింగ్‌పై అసంతృప్తి వ్యక్తం చేసిన ఢిల్లీ హైకోర్టు.. ఈడీ, సీబీఐల అధికారిక ప్రకటనలను మాత్రమే మీడియా ప్రసారం చేయాలని ఆదేశించింది.

ఈ కేసులో తప్పుడు కథనాలు ప్రసారం చేసిన రిపబ్లిక్ టీవీ, ఇండియా టుడే, జీ న్యూస్, టైమ్స్ నౌలకు ఢిల్లీ హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. అలాగే ఈ చానెల్‌లు ప్రసారం చేసే వార్తా నివేదికలను పరిశీలించి, ప్రసారాలు వాటి మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని కోర్టుకు తెలియజేయాలని న్యూస్ బ్రాడ్‌కాస్టింగ్ మరియు డిజిటల్ స్టాండర్డ్స్ అథారిటీ (ఎన్ బిడీఎస్ఏ)ని కోర్టు ఆదేశించింది. విచారణ సందర్భంగా చానెళ్లను నిరోధించే అధికారం అసోసియేషన్ కు లేదని ఎన్ బిడీఎస్ఏ తరపు న్యాయవాది చెప్పగా దీనిపై జస్టిస్ వర్మ అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాంటి అధికారం మీకు లేనప్పుడు మేము మిమ్మల్ని ఎందుకు రద్దు చేయకూడదని కోర్టు ప్రశ్నించింది. వార్తా చానెల్‌లు ప్రచురించే విషయాలు సీబీఐ, ఈడీ వెల్లడించిన వివరాలతో సరితూగాలని ఆదేశిస్తూ కేసులో తదుపరి విచారణ ఫిబ్రవరికి వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed