HC quashes rape case: లైంగిక సంబంధం వివాహంతో ముగియకపోతే నేరం కాదు- హైకోర్టు

by Shamantha N |
HC quashes rape case: లైంగిక సంబంధం వివాహంతో ముగియకపోతే నేరం కాదు- హైకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: లైంగిక సంబంధం వివాహానికి దారితీయకపోవడమనేది చట్టరీత్యా నేరం కాదని ఒడిశా హైకోర్టు పేర్కొంది. తొమ్మిదేళ్లుగా పోలీస్ అధికారితో సహజీవనంలో ఉన్న మహిళ దాఖలు చేసిన రేప్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. “ఓ వ్యక్తి చేసిన వాగ్దానం నెరవేరకపోతే.. ఆ ప్రామిస్ కి చట్టం రక్షణ కల్పించలేదు. ప్రతి విఫలమైన బంధాన్ని కోర్టు నేరంగా పరిగణించదు. పిటిషనర్, పోలీసు అధికారి ఇద్దరూ సొంత నిర్ణయాలు తీసుకోగల సమర్థులు. కొంతకాలం సమ్మతితో కూడిన బంధంలో ఉన్నారు. సొంత ఎంపికలు తీసుకోగల ఇద్దరు వ్యక్తుల 2012లో సన్నిహిత సంబంధంలోకి వెళ్లారు. ఆ సంబంధం వివాహంతో ముగియకపోవడం వల్ల వ్యక్తిగత మనోవేదనకు గురికావచ్చు. కానీ, ప్రేమ వైఫల్యం నేరం కాదు. నిరాశను చట్టం మోసంగా చూడదు.” అని జస్టిస్ సంజీబ్ పాణిగ్రాహి తీర్పులో పేర్కొన్నారు.

కోర్టుని ఆశ్రయించిన మహిళ

2012లో ఒడిశా సంబల్‌పూర్ జిల్లాలో పోలీసు అధికారి, మహిళ.. ఇద్దరూ కంప్యూటర్ కోర్సు చదువుతున్నప్పుడు ఇరువురి మధ్య సన్నిహిత సంబంధం ప్రారంభమైంది. 2021లో బోలాంగిర్ జిల్లాలో కోర్టులో మహిళ అధికారిపై ఫిర్యాదు చేసింది. ఆమె అధికారిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. వివాహం చేసుకుంటానని ప్రలోభపెట్టి లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపించింది. సంబల్ పూర్ లోని సమలేశ్వరి ఆలయంలో తాము వివాహం చేసుకున్నట్లు కోర్టుకి తెలిపింది. అయితే, ప్రత్యేక వివాహ చట్టం కింద పెళ్లి నమోదు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నామని.. కానీ పోలీసు అధికారి హాజరుకాలేదని వెల్లడించింది. దీంతో, 2023లో తాను ఎస్ఐ చట్టబద్ధంగా వివాహం చేసుకున్న భార్య అని ప్రకటించాలని కోర్టుని ఆశ్రయించింది. కాగా.. ఈ కేసులోనే ఒడిశా హైకోర్టు తీర్పు వెలువరించింది. సమాజంలో, మన న్యాయ వ్యవస్థలో లైంగికబంధం, వివాహం అనే అంశాలను విడదీయడం అత్యవసమని కోర్టు పేర్కొంది.




Next Story

Most Viewed