- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
'చనిపోయేందుకు అనుమతినివ్వండి'.. మహిళా సివిల్ జడ్జి రాసిన లెటర్ సోషల్ మీడియాలో వైరల్

న్యూఢిల్లీ : ‘‘చనిపోయేందుకు అనుమతివ్వండి.. జిల్లా న్యాయమూర్తి, ఆయన అనుచరులు నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు’’ అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఓ మహిళా సివిల్ జడ్జి రాసిన ఓపెన్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఉత్తరప్రదేశ్‌లోని బాందా జిల్లాకు చెందిన జడ్జి రాసిన ఈ లేఖ తన దృష్టికి రావడంతో సీజేఐ డి.వై. చంద్రచూడ్ స్పందించారు. దీనిపై తక్షణమే తనకు నివేదిక కావాలని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ అతుల్ ఎం కుర్హేకర్‌ను ఆదేశించారు. దీంతో ఆ మహిళా న్యాయమూర్తి ఫిర్యాదు, దానిపై విచారణకు సంబంధించిన మొత్తం వివరాలను సమర్పించాలని అలహాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు కుర్హేకర్ లేఖ రాశారు.
‘‘రాత్రి పూట కలవాలని అంటున్నారు’’
‘‘సామాన్య ప్రజలకు న్యాయం చేసేందుకు నేను న్యాయ వృత్తిలో చేరాను. ఇప్పుడు అదే న్యాయం కోసం నేను ప్రతి తలుపు తట్టాల్సి వస్తోంది. గత కొన్ని నెలలుగా జిల్లా న్యాయమూర్తి, ఆయన అనుచరులు నాపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. నన్ను పురుగు కంటే హీనంగా చూస్తున్నారు. రాత్రి పూట జిల్లా న్యాయమూర్తిని ఒంటరిగా కలవాలని అంటున్నారు’’ అని బాధిత మహిళా జడ్జి తన లేఖలో పేర్కొన్నారు. ‘‘నాకు ఎదురవుతున్న లైంగిక వేధింపుల గురించి ఈ ఏడాది జులైలోనే హైకోర్టు అంతర్గత ఫిర్యాదుల కమిటీకి చెప్పాను. కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. ఈ కేసులో సాక్షులంతా జిల్లా న్యాయమూర్తి కింద పనిచేసేవారే. తమ బాస్‌కు వ్యతిరేకంగా వాళ్లు సాక్ష్యం ఎలా చెప్పగలరు? అందుకే దర్యాప్తు పూర్తయ్యే దాకా జిల్లా న్యాయమూర్తిని మరో చోటుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాను. అయినా సెకన్ల వ్యవధిలో నా అభ్యర్థనను కొట్టేశారు’’ అని జడ్జి వివరించారు. ‘‘గత ఏడాదిన్నర కాలంగా నేను జీవచ్ఛవంలా బతుకుతున్నాను. నేను బతికుండి కూడా ప్రయోజనం లేదు. గౌరవప్రదంగా చనిపోయేందుకు నాకు అనుమతినివ్వండి’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.