Siddaramaiah : సీఎం కుర్చీపై వర్రీ అవసరం లేదు

by M.Rajitha |   ( Updated:2024-09-11 12:12:37.0  )
Siddaramaiah : సీఎం కుర్చీపై వర్రీ అవసరం లేదు
X

దిశ, వెబ్ డెస్క్ : కర్ణాటక సీఎం సిద్దరామయ్య(Siddaramaiah) 'ముడా' కుంభకోణం(MUDA scam)పై హైకోర్టులో విచారణను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే త్వరలోనే కర్ణాటక(Karnataka) సీఎం సీటు ఖాళీ అవుతుందని కన్నడనాట జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఈ చర్చలకు చెక్ పెట్టారు. 'కర్ణాటక సీఎం కుర్చీ గురించి ఎవరూ వర్రీ అవ్వాల్సిన పని లేదు, ఆ సీటు ఖాళీగా ఉంటే కదా.. మరెవరైనా రావడానికి.. ఆ పదవిలో కొనసాగేది నేనే' అంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు కర్ణాటక సీఎం పదవిపై వస్తున్నఊహాగానాలకు తెరదించాలని ఆ రాష్ట్ర పీసీసీ నేత మంజునాథ్ బండారి.. ఏఐసీసీ పెద్దలను కోరారు.

కాగా 'మైసూర్ నగరాభివృద్ది సంస్థ' (ముడా).. పలు అభివృద్ది పనుల నిమిత్తం సిద్దరామయ్య భార్యకు వారసత్వంగా వచ్చిన భూమిని స్వాధీనం చేసుకొని, ఆమెకు మరోచోట భూమిని కేటాయించింది. అయితే ఆ కేటాయించిన భూమి విలువ స్వాధీనం చేసుకున్న భూమి కంటే ఎన్నో రేట్లు ఎక్కువని, ఇందులో సీఎం హస్తం ఉందని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. ఈ ఆరోపణలపై స్పందించిన కర్ణాటక గవర్నర్ ధావర్ చంద్ గెహ్లాట్.. సిద్దరామయ్య మీద విచారణకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం మీద విచారణకు ఆదేశాలు ఇచ్చే హక్కు గవర్నర్ కు లేదంటూ, తనమీద ఎలాంటి విచారణ జరపకుండా ఆదేశాలు ఇవ్వమని సిద్దరామయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ మీద ప్రస్తుతం హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో సీఎంకు శిక్ష పడటం ఖాయం అంటూ.. త్వరలోనే సీఎం సీటు ఖాళీ అవుతుందంటూ కన్నడ నాట జోరుగా చర్చ సాగుతోంది. ఈ అంశం మీదనే సిద్దరామయ్య తాజా వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story