Nipah virus: కేరళలో మరోసారి ‘నిఫా’ కలకలం.. వైరస్ సోకి 24 ఏళ్ల యువకుడు మృతి

by vinod kumar |
Nipah virus: కేరళలో మరోసారి ‘నిఫా’ కలకలం.. వైరస్ సోకి 24 ఏళ్ల యువకుడు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం రేపింది. వైరస్ సోకి 24 ఏళ్ల యువకుడు మరణించినట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఆదివారం వెల్లడించారు. మలప్పురంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న యువకుడు పరిస్థితి విషమించి శనివారం మృతి చెందాడు. అయితే అనుమానం వచ్చిన వైద్య సిబ్బంది ఆయన శాంపిల్స్‌ను కోజికోడ్‌లోని మెడికల్ కళాశాలకు పంపించారు. అక్కడ పరీక్ష నిర్వహించగా నిఫా పాజిటివ్‌గా తేలింది. దీంతో అప్రమత్తమైన మంత్రి వీణా జార్జ్ అధికారులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రొటోకాల్‌ ప్రకారం అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మరణించిన యువకుడు బెంగళూరులోని ఓ కళాశాలలో చదువుతుండగా 151 మంది ఆయన ప్రైమరీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నారు. నాలుగు ప్రయివేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందడంతో పాటు స్నేహితులతో కలిసి పలు ప్రాంతాలకు వెళ్లినట్టు గుర్తించారు. వారందరి సమాచారాన్ని సేకరించి, ప్రత్యక్షంగా సంప్రదించిన వారిని ఐసోలేషన్‌కు తరలించారు. ఐసోలేషన్‌లో ఉన్న ఐదుగురు వ్యక్తులకు కొన్ని తేలికపాటి లక్షణాలు ఉండటంతో వారి నమూనాలను ల్యాబ్‌కు పంపించారు. ఎవరికైనా వ్యాధి సోకితే ప్రాథమిక దశలోనే గుర్తించి, ఇతరులకు వ్యాధి సోకకుండా ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టిందని మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ప్రజలు భయాందోళనకు గురి కావొద్దని సూచించారు. కాగా, గతంలోనూ కేరళలో నిఫా వైరస్ కేసులు వెలుగు చూసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story