అశోకా యూనివర్సిటీలో ఉద్రిక్తతలు

by Ajay kumar |
అశోకా యూనివర్సిటీలో ఉద్రిక్తతలు
X

- కొత్త రూల్స్ పెట్టిన అధికారులు

- ఆందోళన బాట పట్టిన విద్యార్థులు

- పోలీసులతో నిండిపోయిన యూనివర్సిటీ

దిశ, నేషనల్ బ్యూరో:

హర్యానా సోనిపట్‌లో ఉన్న అశోకా యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. యూనివర్సిటీ అధికారులు క్యాంపస్‌లో భద్రతా చర్యల పేరుతో కొత్త రూల్స్‌ను అమలు చేయడంపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. క్యాంపస్‌లోకి వచ్చే వాహనాలను, వ్యక్తులను క్షణ్ణంగా చెక్ చేసి పంపుతుండటంపై విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ జనవరి 13న కొత్త మార్గదర్శకాలను ఈ-మెయిల్ ద్వారా విద్యార్థులకు పంపారు. ఇందులో విద్యార్థుల రాకపోకలను వేరే గేటుకు మార్చినట్లు పేర్కొన్నారు. అంతే కాకుండా.. ప్రతీ విద్యార్థి జేబులను కూడా తనిఖీ చేయనున్నట్లు అందులో పేర్కొన్నారు. క్యాంపస్‌లో మద్యం, సిగరెట్ల వాడకాన్ని తగ్గించడానికే ఈ నిబంధనలు అమలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా, ఈ కొత్త రూల్స్‌పై విద్యార్థులు మండిపడుతున్నారు. వెంటనే ఈ రూల్స్ వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే యూనివర్సిటీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడాన్ని ది అశోక యూనివర్సిటీ స్టూడెంట్ గవర్నమెంట్ (ఏయూఎస్‌జీ) ఖండించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు, ఫ్యాకల్టీల నుంచి 1100 సంతకాలు సేకరించి అధికారులకు పంపారు. జనవరి 17 నుంచి ప్రతీ వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. టూవీలర్స్‌కు ఉండే ట్యాంక్ కవర్లు, చేతి గ్లవ్స్, కార్లలో సీట్ల కింద కూడా తనిఖీలు చేస్తున్నారు. కాగా, క్యాంపస్‌కు వచ్చే ట్యాక్సీ డ్రైవర్ల, తల్లిదండ్రుల వస్తువులను కూడా తనిఖీ చేయడంపై విద్యార్థులు మండిపడుతున్నారు. ఈ అంశంపై క్యాంపస్‌లో విద్యార్థులందరూ నిరసనలకు దిగగా.. పోలీసు బలగాలను రంగంలోకి దింపారు. అంతే కాకుండా క్యాంపస్‌లో ఎక్కడా నిలబడ కుండా ఎప్పటికప్పుడు నీటితో గచ్చులను తడుపుతున్నారు.



Next Story