- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Delhi stampede: ఢిల్లీ స్టేషన్ లో తొక్కిసలాట.. రైల్వేశాఖ కీలక నిర్ణయం

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట తర్వాత రైల్వేశాఖ కీలక చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా రద్దీగా ఉండే 60 రైల్వే స్టేషన్లలో శాశ్వత హోల్డింగ్ జోన్లను ఏర్పాటు చేయనుంది. దీంతో పాటు.. రద్దీని నియంత్రించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను ఉపయోగించనుంది. రైల్వే అధికారులకు ప్రత్యేక శిక్షణ అందించడం, ప్రయాణికుల సురక్షితం కోసం మార్గదర్శకాలు ఇవ్వడం అవసరమని కేంద్రం భావించింది. అందులో భాగంగానే ప్రయాణికులకు సూచనలు అందించేందుకు బాణం గుర్తులు, డివైడర్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా రైలు ఆలస్యం అయ్యే సమయంలో జనసమూహ కదలికలను పర్యవేక్షించడానికి ఏఐతో సహా సాంకేతికపరిజ్ఞానాన్ని వాడనుంది. ఇక, ప్రయాగ్‌రాజ్‌కు అనుసంధానించబడిన 35 స్టేషన్లను సెంట్రల్ వార్ రూమ్ పర్యవేక్షించనున్నట్లు అదికారులు తెలిపారు. రద్దీ నియంత్రణ చర్యల్లో భాగంగా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో 200 కొత్త సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దీంతో.. ఫుట్ పాత్, బ్రిడ్జిలపై నడిచే వ్యక్తులను పర్యవేక్షించవచ్చు. ఇకపోతే, మహాకుంభమేళా కోసం వెళ్లే భక్తులలో 90 శాతం మంది యూపీ చుట్టుపక్కలున్న రాష్ట్రాల నుంచే వస్తారు. రద్దీకి సంబంధించిన సమస్యలను గుర్తించడానికి రైల్వేలు ప్రత్యేక ప్రచారాన్ని నిర్వహించనున్నాయి. ప్రయాణికులు, కూలీలు, దుకాణదారుల నుంచి అభిప్రాయాన్ని తీసుకోనున్నాయి.
తొక్కిసలాట..
ఢిల్లీ రైల్వే స్టేషన్లోని ప్లాట్‌ఫాం నంబర్ 16పై శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో తొక్కిలాట జరిగింది. ఈ ఘటనలో 18 మంది చనిపోయారు. పలువురికి గాయల్యయాయి. కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులు రైలు ఎక్కడం కోసం ఇరుకైన ఫుట్ పాత్ వైపు పరుగెత్తారు. దీనితో ఫుట్ పాత్ ఎక్కేవారికి, దిగేవారికి మధ్య తొక్కిసలాట జరిగింది. దీంతో.. 18 మంది చనిపోవడమే కాకుండా.. అధిక సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. రైల్వే మంత్రిత్వ శాఖ ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టేందుకు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తోంది.ఇతర పత్రాలను పరిశీలిస్తోంది. ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో రద్దీని నియంత్రించేందుకు ఫిబ్రవరి 26 వరకు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లోని కౌంటర్ ద్వారా ప్లాట్‌ఫామ్ టిక్కెట్ల అమ్మకం నిలిపివేశారు. ఆటోమేటిక్ వెండింగ్ మెషీన్ల ద్వారా టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి. ప్రయాగ్‌రాజ్‌కి వెళ్లే అన్ని ప్రత్యేక రైళ్లను ప్లాట్‌ఫాం నంబర్ 16 నుండి నడుపుతున్నారు. ప్రయాణికులు అజ్మేరీ గేట్ నుండి స్టేషన్‌లో ప్రవేశించాలని రైల్వే అధికారులు సూచించారు.