Assembly Bypolls : బైపోల్స్‌లో 48 అసెంబ్లీ సీట్లలో 25 ఎన్డీయే కైవసం.. 2 లోక్‌సభ సీట్లు కాంగ్రెస్ హస్తగతం

by Hajipasha |
Assembly Bypolls : బైపోల్స్‌లో 48 అసెంబ్లీ సీట్లలో 25 ఎన్డీయే కైవసం.. 2 లోక్‌సభ సీట్లు కాంగ్రెస్ హస్తగతం
X

దిశ, నేషనల్ బ్యూరో : దేశంలోని 15 రాష్ట్రాల పరిధిలోని 48 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్‌సభ స్థానాలకు జరిగిన బైపోల్స్(Assembly Bypolls) ఫలితాలు కూడా శనివారం వెలువడ్డాయి. 48 అసెంబ్లీ స్థానాలకుగానూ 25 ఎన్డీయే(NDA) కూటమి ఖాతాలో చేరాయి. రెండు లోక్‌సభ స్థానాలు(వయనాడ్, నాందేడ్) మళ్లీ కాంగ్రెస్‌కే దక్కాయి. ఉత్తరప్రదేశ్‌(UP), బిహార్‌, రాజస్థాన్‌, అసోంలలో మెజార్టీ స్థానాలు ఎన్డీయే కూటమి కైవసం అయ్యాయి. అసోంలో ఐదు స్థానాలకు ఐదు ఎన్డీయేకు దక్కాయి. ఉత్తరప్రదేశ్‌లోని 9 స్థానాల్లో ఉప ఎన్నికలు జరగగా బీజేపీ 6 సీట్లు, దాని మిత్రపక్షం ఆర్‌ఎల్‌డీ 1 సీటు గెల్చుకున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ 2 స్థానాల్లో గెల్చింది. బిహార్‌లోని 4 స్థానాలన్నీ ఎన్డీయే కూటమి హస్తగతం చేసుకుంది. కూటమిలోని బీజేపీ 2 స్థానాల్లో, జేడీయూ, హెచ్ఏఎం పార్టీలు చెరొక స్థానంలో నెగ్గాయి. ఈ రాష్ట్రంలో ఇండియా కూటమికి చెందిన ఒక సీటును ఈసారి బీజేపీ గెల్చుకుంది. ప్రశాంత్‌ కిశోర్‌ పార్టీ జన్ సురాజ్ తరఫున అభ్యర్థులను నిలబెట్టినప్పటికీ ఏ ఒక్కరూ విజయం సాధించలేదు. రాజస్థాన్‌లోని 7 స్థానాలకుగానూ ఐదింటిని బీజేపీ చేజిక్కించుకుంది. భారత్ ఆదివాసీ పార్టీ, కాంగ్రెస్‌లు చెరొక స్థానంలో గెలిచాయి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు చెందిన మూడు స్థానాలు ఈసారి బీజేపీ ఖాతాలో చేరాయి. బెంగాల్‌లో మొత్తం ఆరు స్థానాలను టీఎంసీ దక్కించుకుంది. పంజాబ్‌లో నాలుగు స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా మూడు చోట్ల ఆమ్‌ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌ ఒకచోట గెలుపొందాయి. కర్ణాటకలో మూడు స్థానాలనూ కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. చెన్నపట్నలో జేడీఎస్‌ నేత కుమారస్వామి తనయుడు నిఖిల్‌ పోటీ చేసి ఓడిపోయారు.

కేరళ, మధ్యప్రదేశ్, సిక్కింలలో..

కేరళలో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరిగింది. పాలక్కడ్‌లో కాంగ్రెస్‌, చెలక్కరలో సీపీఎం అభ్యర్థులు గెలిచారు. వయనాడ్‌ లోక్‌సభ నుంచి కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకా గాంధీ 4.10 లక్షల మెజార్టీతో ఘన విజయం సాధించారు. మహారాష్ట్రలోని నాందేడ్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్ గెలిచింది. నాందేడ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి రవీంద్ర వసంత్ రావు చవాన్ 1,457 ఓట్ల స్వల్ప తేడాతో గెలిచారు. మధ్యప్రదేశ్‌లో రెండు స్థానాలకు ఉప ఎన్నిక జరగగా విజయ్‌పూర్‌లో కాంగ్రెస్‌, బుద్‌నీలో బీజేపీ గెలిచాయి. సిక్కింలో రెండు స్థానాల్లో సిక్కిం క్రాంతికారీ మోర్చా గెలుపొందింది. విపక్ష సిక్కిం డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ అభ్యర్థులను ఉపసంహరించుకోవడంతో రెండు చోట్ల అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవమైంది. ఛత్తీస్‌గఢ్‌లోని ఒక స్థానంలో బీజేపీ అభ్యర్థి సునీల్‌ కుమార్‌ సోనీ విజయం సాధించారు. గుజరాత్‌లో వావ్‌ అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ అభ్యర్థి ఠాకుర్‌ స్వరూప్‌జీ సర్దార్జీ గెల్చుకున్నారు. మేఘాలయాలోని గాంబెగ్రే అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో సీఎం కాన్రాడ్ సంగ్మా సతీమణి మెహతాబ్ చాందీ సంగ్మా(నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ) విజయం సాధించారు. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ గెల్చింది.

Advertisement

Next Story

Most Viewed