పుస్తకాల్లో రామాయణం, మహాభారతం పాఠాలు

by Harish |   ( Updated:2023-11-21 13:17:48.0  )
పుస్తకాల్లో రామాయణం, మహాభారతం పాఠాలు
X

న్యూఢిల్లీ: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ) కమిటీ రామాయణం, మహాభారతం వంటి భారతీయ ఇతిహాసాలను చరిత్ర పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని సిఫార్సు చేసింది. ప్రతిపాదిత మార్పులలో చరిత్ర సిలబస్‌ను నాలుగు విభిన్న కాలాలుగా మార్పులు చేస్తూ ప్రతిపాదనలు పంపింది. అంతేకాకుండా తరగతి గదుల్లో ఉండే గోడలపై రాజ్యాంగ పీఠికను స్థానిక భాషల్లో రాయాలని సూచించింది.

చరిత్రకు సంబంధించిన సిలబస్‌లో శాస్త్రీయ, మధ్య, బ్రిటిష్ కాలం, ఆధునిక భారతంగా వర్గీకరించనున్నారు. ప్రస్తుతం ప్రాచీన, మధ్య, ఆధునిక యుగాలు మాత్రమే ఉన్నాయి. అలాగే, వేదాలు, ఆయుర్వేదానికి సంబంధించిన ప్రభావవంతమైన సాహిత్య రచనలను పరిచయం చేయాలని కూడా ప్యానెల్ సూచించింది.

చరిత్రకు సంబంధించిన పుస్తకాల్లో భారతీయ రాజులు, సుభాష్ చంద్రబోస్ లాంటి స్వాతంత్య్ర సమరయోధుల గురించిన పాఠాలను చేర్చాలని, పాఠ్య పుస్తకాల్లో ఇండియాకు బదులుగా 'భారత్ 'పేరును వాడాలని పేర్కొంది. ప్రస్తుతానికి ప్రక్రియ కొనసాగుతోందని, పూర్తి వివరాలను వెల్లడించలేమని ఎన్‌సీఈఆర్‌టీ ఓ ప్రకటనలో తెలిపింది.

Advertisement

Next Story