NASA: సునీతా విలియమ్స్ సహా వ్యోమగాములను తీసుకొచ్చే రాకెట్ ప్రయోగం మరోసారి వాయిదా

by S Gopi |

దిశ, నేషనల్ బ్యూరో: రోదసిలోకి వెళ్లిన భారత సంతతి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్‌తో పాటు బుచ్‌ విల్మోర్‌ను భూమిపైకి తిరిగి తీసుకొచ్చే నాసా, స్పేస్ఎక్స్ రాకెట్ ప్రయోగం మరోసారి వాయిదా పడింది. అమెరికాలోని ఫ్లోరిడా నుంచి ఫాల్కన్ 9లో నలుగురు వ్యోమగాములను పంపేందుకు క్రూ 10 మిషన్ సిద్ధమైంది. అయితే, బయలుదేరే సమయంలో ఫాల్కన్ 9 రాకెట్‌కు గ్రౌండ్ సపోర్ట్ క్లాంప్ ఆర్మ్‌తో హైడ్రాలిక్ వ్యవస్థలో సమస్య తలెత్తడంతో అంతరిక్ష కేంద్రానికి వెళ్లాల్సిన రాకెట్ ప్రయోగాన్ని వాయిదా వేశారు. దీంతో సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు మరికొన్ని రోజులపాటు అంతరిక్ష కేంద్రంలోనే ఉండాల్సి ఉంది. అనుకోకుండా ఎదురైన సాంకేతిక సమస్యను పరిష్కరించిన అనంతరం మరో వారం రోజుల్లో ప్రయోగాన్ని చేపడతామని నాసా తెలిపింది. అన్ని అనుకున్నట్టు జరిగే స్పేస్‌ఎక్స్ ఇద్దరు వ్యోమగాములను మార్చి 19 నాటికి తిరిగి భూమి మీదకు తీసుకురావాల్సి ఉంది. ఇటీవల సునీత విల్యమ్స్ మాట్లాడుతూ.. మార్చి 12న స్పేస్ఎక్స్‌కు చెందిన క్రూ10 మిషన్ వస్తుందని, అందులో ఐఎస్ఎస్‌లోకి కొత్తగా వచ్చే వ్యోమగాములు తమ బాధ్యతలను తీసుకుంటారని తెలిపారు.

Next Story

Most Viewed