Mother Tongue: సృజనాత్మకతకు మాతృభాష చాలా ముఖ్యం.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్

by vinod kumar |
Mother Tongue: సృజనాత్మకతకు మాతృభాష చాలా ముఖ్యం.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్
X

దిశ, నేషనల్ బ్యూరో: సృజనాత్మక ఆలోచనలను పెంపొందించుకోవడానికి మాతృభాషే కీలకమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ (Dharmendra pradhaan) అన్నారు. ఢిల్లీలో బుధవారం నుంచి నిర్వహిస్తున్న భారతీయ భాషా ఉత్సవ్ వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. భాషాభిమానాన్ని తిరిగి పొందేందుకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP) 2020 ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. దేశ భాషా వైవిధ్యాన్ని పరిరక్షించడంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. ‘భారతీయ నాగరికతలో భాషాపరమైన గర్వం ఉంది. దేశ భాషలన్నీ జాతీయ భాషలు. భాషా వైవిధ్యం జాతీయ ఐక్యతను బలపరుస్తుంది. ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడుతుంది. కాబట్టి మన ప్రజల్లో ప్రతి ఒక్కరూ భాషాభిమానాన్ని గౌరవంగా భావించాలి’ అని వ్యాఖ్యానించారు. ‘మాతృభాష లోతైన అభ్యాసానికి ప్రధానమైంది. ఎందుకంటే మన భాషలు కేవలం కమ్యూనికేషన్ సాధనాలు కాదు. అవి చరిత్ర, సంప్రదాయం, జానపద కథలు, తరతరాల సామూహిక జ్ఞానాన్ని సంరక్షిస్తాయి. ప్రత్యేకమైన ప్రపంచ దృష్టికోణాన్ని అందిస్తాయి’ అని తెలిపారు.

Advertisement

Next Story