ప్రైవేటీకరణను గుడ్డిగా అమలు చేస్తూ రిజర్వేషన్లను లాక్కుంటున్న మోడీ ప్రభుత్వం

by S Gopi |
ప్రైవేటీకరణను గుడ్డిగా అమలు చేస్తూ రిజర్వేషన్లను లాక్కుంటున్న మోడీ ప్రభుత్వం
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని నరేంద్ర మోడీపై ఘాటు విమర్శలు చేశారు. ప్రైవేటీకరణను గుడ్డిగా అమలు చేయడం ద్వారా దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లను మోడీ ప్రభుత్వం రహస్యంగా లాక్కుంటోందని విమర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేస్తామని, ఉపాధి కోసం తమ పార్టీ హామీ ఇస్తోందని రాహుల్ గాంధీ అన్నారు. 2013లో ప్రభుత్వ రంగంలో 14 లక్షల శాశ్వత ఉద్యోగాలు ఉండగా, 2023 నాటికి అవి 8.4 లక్షలకు పడిపోయాయని గురువారం ఎక్స్‌లో ట్వీట్ చేశారు. బీఎస్ఎన్ఎల్, సెయిల్, బీహెచ్ఈఎల్ వంటి దిగ్గజ ప్రభుత్వ రంగ సంస్థలను నాశనం చేయడం ద్వారా దాదాపు 6 లక్షల పర్మినెంట్ పోస్టులు ప్రభుత్వ రంగం నుచి తొలగించబడ్డాయని, అవన్నీ ఉంటే రిజర్వేషన్ల ప్రయోజనాలు అందించేవని రాహుల్ గాంధీ వెల్లడించారు. ఇక, రైల్వే లాంటి సంస్థల్లో కాంట్రాక్టుపై ప్రభుత్వ పనులను అప్పగిస్తూ దొడ్డి దారిన తొలగించిన ఉద్యోగాలకు లెక్కేలేదు. మోడీ మోడల్ ప్రైవేటీకరణ దేశ వనరులను కొల్లగొట్టడమేనని, దీని ద్వారా అణగారిన వర్గాల రిజర్వేషన్లు లాగేసుకుంటున్నారని ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేస్తామని, ఖాళీగా ఉన్న 30 లక్షల ప్రభుత్వ పోస్టులను భర్తీ చేయడం ద్వారా సమాజంలోని ప్రతి వర్గానికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్టు రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

Advertisement

Next Story