Bulldozer Action :రంగంలోకి బుల్డోజర్లు.. ఎంసీడీ సీరియస్.. వాట్స్ నెక్ట్స్ ?

by Hajipasha |   ( Updated:2024-07-29 14:51:21.0  )
Bulldozer Action :రంగంలోకి బుల్డోజర్లు.. ఎంసీడీ సీరియస్.. వాట్స్ నెక్ట్స్ ?
X

దిశ, నేషనల్ బ్యూరో : దేశ రాజధానిలోని రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ బేస్మెంట్‌‌ను వరదనీరు ముంచెత్తి ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు చనిపోయిన ఘటనను ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) సీరియస్‌గా తీసుకుంది. ఓల్డ్ రాజేందర్ నగర్‌ సహా నగరంలో పలు ప్రాంతాల్లో ఆక్రమణల తొలగింపునకు ఎర్త్ మూవర్లు, బుల్డోజర్లను సోమవారం రంగంలోకి దింపింది. వరద కాల్వలు, డ్రైనేజీపై అక్రమంగా ఉన్న నిర్మాణాలను తొలగించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఈక్రమంలోనే ఓల్డ్‌ రాజేందర్‌‌నగర్‌ పరిధిలోని 13 కోచింగ్‌ సెంటర్‌లకు ఎంసీడీ సీల్‌ వేసింది. వాటిలోని బేస్మెంట్లలో తరగతులు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అత్యవసర పరిస్థితికి తక్షణమే స్పందించడంలో విఫలమైనందుకు ఒక జూనియర్ ఇంజినీర్‌, ఒక అసిస్టెంట్ ఇంజినీర్‌ను ఎంసీడీ సస్పెండ్ చేసింది. మరో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌కు మెమో జారీ చేసింది. రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ బేస్మెంట్‌‌ ఏరియాకు వరద పోటెత్తే స్థాయికి నీరు ఎందుకు చేరిందనే దానిపై వివరాలను సేకరించే పనిలో ఎంసీడీ ఉన్నతాధికారులు ఉన్నారు.

పూడికతీత పనులపైనే ఫోకస్

వర్షాకాలంలో వరద నీళ్లు పోటెత్తిన సందర్భాల్లో .. అది భూమిలోకి ఇంకిపోయేందుకు ఢిల్లీ నగరమంతటా వరద కాల్వలను నిర్మించారు. ఓల్డ్ రాజేందర్ నగర్‌‌లోని రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ బేస్మెంట్‌‌‌లోకి వరద నీరు పోటెత్తడానికి.. ఆ వరద కాల్వలలో పూడిక పేరుకుపోవడమే కారణమని అధికార వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఆయా వరద కాల్వల్లో వర్షాకాలానికి ముందే (జూన్ నాటికే) పూడికతీత పనులు చేశామని ఎంసీడీ అంటోంది. కోచింగ్‌ సెంటర్‌ సమీపంలోని డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక.. పైపులైన్లు, మురుగు కాల్వలు దెబ్బతినడం వల్లే రోడ్డుపై పెద్దఎత్తున వర్షపు నీరు చేరి, అది బేస్‌మెంట్‌లోకి ప్రవేశించిందని అంటున్నారు. అయితే పైపులైన్లు చెక్కుచెదర లేదని, అవి బాగానే ఉన్నాయని ఢిల్లీ జల్ బోర్డ్ వాదిస్తోంది.

త్వరలో ఎంసీడీ అధికారుల విచారణ

డ్రైనేజీల పూడికతీత, రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్‌కు జారీ చేసిన క్లియరెన్స్ సర్టిఫికెట్ వ్యవహారంలో సంబంధిత ఎంసీడీ అధికారులను ఢిల్లీ పోలీసులు విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. కోచింగ్ సెంటర్ ఉన్న భవనంలోని బేస్మెంట్‌ను గిడ్డంగిగా వాడుకోవచ్చని ఢిల్లీ ఫైర్ సర్వీసు అనుమతులివ్వగా.. దాన్ని స్టడీ సర్కిల్ నిర్వాహకులు లైబ్రరీగా వాడుకున్న అంశంపైనా దర్యాప్తు జరగనుంది. ఈ కేసులో ఇప్పటివరకు ఢిల్లీ పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. తాజాగా సోమవారం రోజు ఐదుగురిని అరెస్టు చేశారు. వీరిలో నలుగురు కోచింగ్ సెంటర్ కో ఫౌండర్లు కాగా, ఒకరు కోచింగ్‌ సెంటర్‌ ముందు నుంచి వేగంగా ఎస్‌యూవీ నడిపిన వ్యక్తి. ఈ ఐదుగురిని సోమవారం మధ్యాహ్నం ఢిల్లీలోని తీస్‌ హజారీ కోర్టు‌లో హాజరుపర్చగా.. న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ నెల 27న సాయంత్రం భారీ వర్షం కారణంగా రావూస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఎదుట రోడ్డుపై భారీగా వరద నీరు నిలిచింది. ఈ క్రమంలో కోచింగ్‌ సెంటర్‌ ఎదుట నుంచి ఓ ఎస్‌యూవీ వేగంగా వెళ్లింది. దాంతో ఆ వరద తాకిడికి కోచింగ్‌ సెంటర్‌ గేటు ఊడిపోయింది. ఆ వెంటనే రోడ్డుపై ఉన్న వరదనీరు వేగంగా సెల్లార్‌లోకి పోటెత్తింది. నిర్లక్ష్యంగా వాహనం నడిపి ముగ్గురు విద్యార్థుల మృతికి పరోక్షంగా కారణమైనందున పోలీసులు ఆ వాహన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed