బీఎస్పీలో భారీ కుదుపు.. పార్టీ పదవుల నుంచి ఆకాశ్ ఆనంద్ తొలగింపు -

by John Kora |
బీఎస్పీలో భారీ కుదుపు.. పార్టీ పదవుల నుంచి ఆకాశ్ ఆనంద్ తొలగింపు  -
X

- సోదరుడు ఆనంద్, ఎంపీ రామ్‌జీకి కొత్త బాధ్యతలు

- పార్టీని బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తే చర్యలు తప్పవు

- యూపీలో బహుజనుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

- బీఎస్పీ అధినేత మాయావతి

దిశ, నేషనల్ బ్యూరో: బహుజన్ సమాజ్‌వాది పార్టీ (బీఎస్పీ)లో భారీ కుదుపు చోటు చేసుకుంది. మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను పార్టీలోని అన్ని పదవుల నుంచి తొలగిస్తూ అధినేత మాయావతి నిర్ణయం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో పార్టీలోని నాయకత్వపు నిర్మాణంలో గణనీయమైన మార్పు ఉంటుందని ఆమె సూచించారు. ఆదివారం నిర్వహించిన పార్టీ కీలక సమావేశం అనంతరం ఆకాశ్ ఆనంద్‌ను పదవుల నుంచి తొలగించడమే కాకుండా.. అతని తండ్రి, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్ కుమార్, రాజ్యసభ ఎంపీ రామ్‌జీ గౌతమ్‌ను జాతీయ సమన్వయకర్తలుగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. యూపీలో బహుజన సమాజం అభివృద్ది రాష్ట్ర పురోగతికే కాకుండా యావత్ దేశ పురోగతికి అవసరమని మాయావతి ఉద్ఘాటించారు. కాన్షీరాం సిద్ధాంతాలకు పార్టీ కట్టుబడి ఉంటుందని.. త్వరలో ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు మాయావతి పేర్కొన్నారు.

కుటుంబ సభ్యులు పార్టీలో పని చేయడాన్ని కాన్షీరాం ఏనాడూ వ్యతిరేకించలేదని, అయితే పార్టీకి గానీ ఉద్యమానికి గానీ హానీ కలిగించినా, తన పేరును దుర్వినియోగం చేసినా కఠిన చర్యలు తీసుకోవాలన్నది కాన్షీరాం సూత్రమని మాయావతి చెప్పారు. ఈ సూత్రానికి అనుగుణంగానే అశోక్ సిద్ధార్థ్‌ను పార్టీ నుంచి బహిష్కరించామని, తాజాగా తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను కూడా పార్టీలోని అన్ని బాధ్యతల నుంచి తప్పించినట్లు మాయావతి ప్రకటించారు. అశోక్ సిద్ధార్థ్ పార్టీలోనే విభజనకు కారణమయ్యారు. బీఎస్పీని సంస్థాగతంగా బలహీనపరిచేందుకు వర్గాలను సృష్టించారని మాయావతి ఆరోపించారు. అశోక్ సిద్ధార్థ్ చర్యలు ఆకాశ్ ఆనంద్‌పై ప్రభావం చూపుతున్నాయి. సిద్ధార్థ్ ఆనంద్ రాజకీయ విధానం ఇప్పటికే పార్టీలో ప్రభావితం చేయడం ప్రారంభించింది. ఇది పార్టీకి మంచిది కాదని మాయావతి సూచించారు. ఆనంద్ కూడా వీటికి ప్రభావితం అయ్యాడని.. అందుకే పక్కకు పెట్టినట్లు మాయావతి పేర్కొన్నారు.

పార్టీలో వర్గ విభేదాలకు సిద్ధార్థ్‌ను పూర్తిగా బాధ్యుడిని చేస్తున్నట్లు మాయావతి తెలిపారు. అతను బీఎస్పీని దెబ్బతీయడమే కాకుండా ఆకాశ్ ఆనంద్ రాజకీయ జీవితాన్ని కూడా పట్టాలు తప్పించాడని మాయావతి పేర్కొన్నారు. పార్టీ నాయకత్వాన్ని స్థిరీకరించడానికి బీఎస్పీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్న ఆనంద్ కుమార్ ఇప్పుడు జాతీయ సమన్వయకర్తగా కూడా పని చేస్తారని మాయావతి ప్రకటించారు. ఇక పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడానికి రాజ్యసభ ఎంపీ రామ్‌జీ గౌతమ్‌ను జాతీయ స్థాయిలో సమన్వయకర్తగా నియమించినట్లు చెప్పారు. పార్టీ వ్యవహారాలను నిర్వహించడంలో ఆనంద్ కుమార్ సామర్థ్యంపై మాయావతి విశ్వాసం వ్యక్తం చేశారు. తన సోదరుడు ఎప్పుడూ తనను నిరాశపరచలేదని, బీఎస్పీ లక్ష్యానికి విధేయుడిగా ఉన్నారని పేర్కొన్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ ఓటమిపాలైన తర్వాత పార్టీ అధినేత్రి మాయావతి ఆకాశ్ ఆనంద్‌ను తన వారసుడిగా ప్రకటించి.. ఆ తర్వాత ఉపసంహరించుకున్నారు. ఆకాశ్ ఆనంద్‌కు రాజకీయ పరిపక్వత అవసరమని మాయావతి పేర్కొన్నారు.

Next Story