మణిపుర్ ప్రజలు మోదీపై కోపంగా ఉన్నారు: మాజీ గవర్నర్ సంచలన కామెంట్స్

by karthikeya |
మణిపుర్ ప్రజలు మోదీపై కోపంగా ఉన్నారు: మాజీ గవర్నర్ సంచలన కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)పై మణిపుర్ ప్రజలు కోపంగా ఉన్నారంటూ ఆ రాష్ట్ర మాజీ గవర్నర్ అనసూయ ఉయికే(Anusuiya Uikey) సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ఈ స్థాయిలో అల్లర్లు జరుగుతున్నా.. ప్రజలు మరణిస్తున్నా ప్రధానమంత్రి ఇప్పటివరకు రాష్ట్రంలో అడుగుపెట్టకపోవడంపై ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారని ఆమె అన్నారు. ఆదివారం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో హింసాత్మక పరిస్థితులు తలెత్తిన వెంటనే ప్రధానమంత్రి, హోంమంత్రి (Home Minister) చర్యలు తీసుకోవాల్సిందని అనసూయ అన్నారు. ‘‘మణిపుర్ ప్రజలకు ప్రధాని మోదీ అంటే ఎంతో గౌరవం. రాష్ట్రంలో ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై వారెంతో ఆనందంగా ఉన్నారు. కానీ ఇలాంటి హింసాత్మక పరిస్థితులు తలెత్తినా.. ఆయన ఒక్కసారి కూడా రాష్ట్రానికి రాకపోవడంపై మాత్రం ఆవేదనగా ఉన్నారు’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు.

అయితే మణిపుర్‌ (Manipur)కు రాకపోయినా రాష్ట్ర పరిస్థితులను ప్రధాని మోదీ అనుక్షణం పర్యవేక్షిస్తున్నారని, హోం మంత్రి కూడా ఇక్కడి పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు. ఇప్పటికే బాధితులకు పునరావాస క్యాంపుల ద్వారా ఆశ్రయం కల్పిస్తున్నామని, వారిలో అనేకమందికి కొత్తగా ఇళ్లు కూడా కట్టిస్తున్నామని వెల్లడించారు. ఇక హింస కారణంగా మరణించిన వారికి రూ.10 లక్షలు, రూ.7 లక్షలు, రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం కూడా ఇస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement

Next Story