నా కుమారుడు వరుణ్ గాంధీకి అందుకే టికెట్ రాలేదు : మేనకాగాంధీ

by Hajipasha |
నా కుమారుడు వరుణ్ గాంధీకి అందుకే టికెట్ రాలేదు : మేనకాగాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో : తన కుమారుడు వరుణ్‌గాంధీకి ఈసారి ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ లోక్‌సభ టికెట్‌ను బీజేపీ ఇవ్వకపోవడంపై మేనకా గాంధీ తొలిసారిగా స్పందించారు. వరుణ్ గాంధీ రచనల వల్లే ఈదఫా ఆయనకు పిలిభిత్ టికెట్‌ దక్కలేదన్నారు. పిలిభిత్ నియోజకవర్గానికి సేవ చేయడానికి వరుణ్ గాంధీకి ఎలాంటి టికెట్ అక్కరలేదన్నారు. యూపీలోని సుల్తాన్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మేనకాగాంధీ శనివారం ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ నా తరఫున సుల్తాన్‌పూర్‌లో ఎన్నికల ప్రచారం చేయాలని వరుణ్‌గాంధీ భావిస్తున్నారు. అయితే దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’’ అని ఆమె తెలిపారు. అయోధ్య రామమందిరం దగ్గర్లోనే ఉన్నప్పటికీ సుల్తాన్‌పూర్‌లో ఆ ప్రభావం పెద్దగా లేదని.. దానికి ఇక్కడి తక్కువ ప్రాధాన్యత ఉందని మేనకాగాంధీ స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో తాను 14వేల మెజారిటీతో గెలిచానని..ఈసారి ఎంత మెజారిటీ వస్తుందో ఇప్పుడే చెప్పలేనన్నారు.‘‘ఎన్‌డీఏ కూటమికి 400కుపైగా లోక్‌సభ సీట్లు.. బీజేపీకి 370 లోక్‌సభ సీట్లు సాధ్యమేనా ?’’ అని మేనకాగాంధీని ప్రశ్నించగా.. "అలాగే జరగబోతోందేమో.. లేదంటే వారు అలా చెప్పరు’’ అని వ్యాఖ్యానించారు. మేనకాగాంధీ పోటీచేస్తున్న సుల్తాన్‌పూర్ స్థానానికి మే 25న పోలింగ్ జరగనుంది. ఈసారి ఆమెపై సమాజ్‌వాదీ పార్టీ నేత రామ్‌ భుల్‌ నిషాద్‌ పోటీ చేస్తున్నారు.

Advertisement

Next Story