Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేనట్టేనా.. ఏ పార్టీకీ సరిపోని మెజారిటీ?

by vinod kumar |
Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేనట్టేనా.. ఏ పార్టీకీ సరిపోని మెజారిటీ?
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అధికార మహాయుతి కూటమి (Mayayuthi alliance) ఘన విజయం సాధించింది. రాష్ట్రంలోని 288 సీట్లకు గాను 231 స్థానాల్లో గెలుపొంది మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమవుతోంది. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ (MVA) కూటమి 45 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. దీంతో ఇప్పుడు ఎవరు సీఎం అవుతారు? ప్రతిపక్ష నేత(Apposition leader) పదవి ఎవరిని వరిస్తుంది అనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. అయితే మహాయుతి కూటమిలోని ఏదో ఒక పార్టీకి చెందిన అగ్రనేత సీఎంగా నియామకమవుతారు. కానీ కొత్తగా ఏర్పడే మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఉండకపోవచ్చని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి కూడా ప్రతిపక్ష హోదా దక్కించుకునేంత మెజారిటీ రాకపోవడమే దీనికి కారణంగా చెబుతున్నారు.

ప్రతిపక్ష నేత ఎంపిక ఎలా?

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష నేత హోదా దక్కాలంటే 288 సీట్లకు గాను ఏ పార్టీకైనా పది శాతం అంటే 29 సీట్లు సాధించాలి. అప్పుడు ఆ పార్టీ ప్రతిపక్ష హోదా కావాలని పట్టుబట్టొచ్చు. కానీ రాష్ట్రంలో మహాయుతి కూటమిలో భాగమైన పార్టీలు తప్ప, ఎంవీఏ కూటమిలోని ఏ పార్టీ కూడా సింగిల్‌గా 29 సీట్లు గెలుచుకోలేదు. దీంతో ఈ సారి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేనట్టేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎంవీఏ కూటమి గెలిచే సీట్లన్నింటీని కలిపితే 29 సీట్లు వస్తాయి. కానీ శాసనసభ నిబంధనల ప్రకారం.. ప్రతిపక్ష నాయకుడి పదవికి పార్టీల ఉమ్మడి బలాన్ని పరిగణనలోకి తీసుకోరు. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 15వ మహారాష్ట్ర శాసనసభ ప్రతిపక్ష నేత లేకుండానే పనిచేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

కాగా, మహరాష్ట్ర ఎన్నికల్లో ఎంవీఏ కూటమిలోని శివసేన(యూబీటీ) 20, కాంగ్రెస్ 15, ఎన్సీపీ(ఎస్పీ) 10 స్థానాల్లో మాత్రమే గెలుపొందాయి. ఇతర చిన్న ప్రాంతీయ పార్టీలకు సైతం అంతకన్నా తక్కువగా సీట్లు వచ్చాయి. కాబట్టి ఏ పార్టీకి కూడా ప్రతిపక్ష హోదా దక్కకపోవచ్చని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, గుజరాత్‌, మణిపూర్‌, నాగాలాండ్‌, సిక్కిం రాష్ట్రాల్లో కూడా కనీసం 10 శాతం సీట్లు సాధించిన ప్రతిపక్ష పార్టీలు లేకపోవడంతో ప్రతిపక్ష నేత హోదా లేకుండానే అసెంబ్లీలు పరి చేస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed