మహారాష్ట్ర ఏకైక కాంగ్రెస్ ఎంపీ కన్నుమూత

by GSrikanth |
మహారాష్ట్ర ఏకైక కాంగ్రెస్ ఎంపీ కన్నుమూత
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్రకు చెందిన ఏకైక కాంగ్రెస్ ఎంపీ సురేష్ ధనోర్కర్(47) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత బాలాసాహెబ్ థోరట్ ధ్రువీకరించారు. ‘కిడ్నీలో రాళ్ల చికిత్స కోసం గత వారం ఆయన్ను నాగ్‌పూర్‌లోని ఆసుపత్రిలో చేర్పించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం న్యూఢిల్లీకి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి మిషమించి ప్రాణాలు కోల్పోయారని థోరట్ తెలిపారు. సురేష్ ధనోర్కర్ చంద్రాపూర్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. అంతకుముందు శివసేనలో పనిచేశారు. 2014లో వరోరా-భద్రావతి అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. 2019లో శివసేన పార్టీని వీడి లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరారు.

మహారాష్ట్రలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఏకైక లోక్‌సభ సభ్యుడిగా సురేష్ ఉన్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన భార్య ప్రతిభ ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇక, ధనోర్కర్ భౌతికకాయాన్ని మంగళవారం మధ్యాహ్నం ఆయన స్వగ్రామం వరోరాకు తరలించనున్నారు. బుధవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, సురేష్ ధనోర్కర్ తండ్రి నారాయణ్ ధనోర్కర్ (80) దీర్ఘకాలిక అనారోగ్యంతో శనివారం సాయంత్రం నాగ్‌పూర్‌లో కన్నుమూశారు. ఆ సమయంలో ఎంపీ సురేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో తండ్రి అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారు. ఇక, తండ్రి తుదిశ్వాస విడిచిన మూడు రోజులకే సురేష్ ధనోర్కర్ మృతి చెందడంతో ఆ కుటుంబంలో, చంద్రాపూర్ నియోజకవర్గంలో తీవ్ర విషాదం నెలకొంది.

Advertisement

Next Story