Kharge: గంగలో మునిగితే విముక్తి రాదు.. బీజేపీకి ఖర్గే కౌంటర్

by Shamantha N |
Kharge: గంగలో మునిగితే విముక్తి రాదు.. బీజేపీకి ఖర్గే కౌంటర్
X

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ నేతలు, మహా కుంభమేళాపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే(Mallikarjun Kharge) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని మహోలో జరిగిన 'జై బాపు, జై భీమ్, జై సంవిధాన్' ర్యాలీలో ఖర్గే ప్రసంగించారు. ఎన్నో తప్పులు చేసిన బీజేపీ నేతలు కుంభమేళాలోని గంగా నీటిలో మునిగితే విముక్తి కలగదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘గంగా నదిలో స్నానం చేయడం వల్ల పేదరికం తొలగిపోతుందా?. అది ఆహారాన్ని అందిస్తుందా? నేను ఎవరి విశ్వాసాన్ని దెబ్బతీయాలని అనుకోవడం లేదు. నా మాటలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే నేను క్షమాపణలు కోరుతున్నాను. కానీ, పిల్లలు ఆకలితో చనిపోతున్నప్పుడు, పాఠశాలకు వెళ్లలేకపోతున్నప్పుడు, కార్మికులకు జీతం అందనప్పుడు, బీజేపీ నాయకులు గంగలో స్నానం చేయడానికి పోటీ పడుతున్నారు. వారు టీవీల్లో పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తుల నుండి దేశం ప్రయోజనం పొందదు. అలాగే.. ప్రధాని మోడీ(Modi), అమిత్‌ షా(Amit Shah) ఎన్నో తప్పులు చేశారు. అలాంటి వ్యక్తులు కుంభమేళాలో స్నానాలు చేస్తే విముక్తి రాదు. మోడీ, అమిత్ షా కచ్చితంగా నరకానికి వెళ్తారు’ అని ఖర్గే అన్నారు.

బీజేపీ కౌంటర్

కాగా.. కాంగ్రెస్ చీఫ్ వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటరిస్తున్నారు. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా ఖర్గే కామెంట్లపై విమర్శలు గుప్పించారు. ఆయన వ్యాఖ్యలను సనాతన ధర్మంపై దాడిగా అభివర్ణించారు. ఆయన మరే ఇతర మతం గురించి అయినా ఇలాంటి కామెంట్లు చేయగలరా? అంటూ ఈ వ్యాఖ్యలను ఖండించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ నేత అమిత్‌ మాల్వియా నిప్పులు చెరిగారు. కుంభమేళాపై ఖర్గే చేసిన వ్యాఖ్యలు ఆయన చేసినవి కాదని.. ఆ మాటలు గాంధీ కుటుంబానికి చెందినవని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ హిందువులను ఎందుకు అంతగా ద్వేషిస్తుంది? అని ప్రశ్నించారు. ప్రజల నమ్మకాలను కాంగ్రెస్ అవమానిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed