Dharmendra Pradhan : భాషను బలవంతంగా రుద్దడం లేదు: ధర్మేంద్ర ప్రధాన్

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2025-02-21 10:21:08.0  )
Dharmendra Pradhan : భాషను బలవంతంగా రుద్దడం లేదు: ధర్మేంద్ర ప్రధాన్
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో ఎవరిపైనా బలవంతంగా హిందీ భాషను రుద్దే ప్రసక్తే లేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్(Dharmendra Pradhan) తమిళనాడు ముఖ్యమంత్రి (Tamil Nadu Chief Minister)ఎంకే స్టాలిన్( M.K. Stalin)కు లేఖ రాశారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తాజాగా ప్రధాని మోదీకి లేఖ రాసిన నేపథ్యంలో ఎక్స్ వేదికగా ధర్మేంద్ర ప్రధాన్ జాతీయ విద్యావిధానంపై వివరణ ఇచ్చారు. విదేశీ భాషపై అతిగా ఆధారపడటం వల్ల విద్యార్థులు స్థానిక భాషాల మూలాలను పూర్తిగా అర్ధం చేసుకోలేకపోతున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. ఆ లోపాన్ని సవరించేందుకే నూతన జాతీయ విద్యా విధానా(NEP)న్ని తీసుకొచ్చామని స్పష్టం చేశారు.

ఈ విధానం భాషా స్వేచ్ఛ సూత్రాన్ని సమర్ధిస్తుందని, విద్యార్థులు నచ్చిన భాషను నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తుందని తెలిపారు . రాజకీయ కారణాలతో తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం నూతన విద్యావిధానాన్ని వ్యతిరేకిస్తోందని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ గతంలో తమిళ భాష శాశ్వతమని చేసిన ప్రకటనను మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గుర్తు చేశారు. తమిళ సంస్కృతి, భాషను విశ్వవ్యాప్తం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. విద్యను రాజకీయాలకు వేదికగా మార్చకూడదని విజ్ఞప్తి చేశారు.

అంతకుముందు సమగ్ర శిక్షా పథకం కింద తమిళనాడుకు రూ.2,152 కోట్ల నిధులను వెంటనే మంజూరు చేయాలని సీఎం స్టాలిన్ ప్రధాని మోదీకి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. జాతీయ విద్యా విధానం-2020ను పూర్తిగా అమలు చేయకపోతే, త్రిభాషా విధానాన్ని ఆమోదించే వరకు ఈ నిధులను ఇవ్వబోమని ఇటీవల కేంద్ర విద్యా శాఖ మంత్రి ప్రకటించారని స్టాలిన్ తన లేఖలో పేర్కొన్నారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని విద్యార్థులు, ప్రజలు, రాజకీయ పార్టీలు మధ్య తీవ్ర అసంతృప్తి, ఆవేదనను రేకెత్తించిందని తెలిపారు. సమగ్ర శిక్షా పథకం కింద నిధులు విడుదల చేయకపోతే, ఉపాధ్యాయులకు వేతనాలు ఇవ్వడం, విద్యార్థులకు సంక్షేమ పథకాలు అమలు చేయడం కష్టమవుతుందని స్టాలిన్ హెచ్చరించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రానికి రావాల్సిన రూ.2,152 కోట్లను తక్షణమే విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు.

అంతకుముందు సీఎం స్టాలిన్ హిందీని బలవంతంగా విధించేందుకు తమను కేంద్రం బ్లాక్ మెయిల్ చేస్తోందని ఆరోపించారు. తమ రాష్ట్రం అమలు చేస్తున్న “రెండు భాషల” విధానాన్ని వదులుకోబోమన్నారు. ఈ వివాదంపై సీఎం కుమారుడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.." ఇది ద్రవిడ భూమి, పెరియార్ భూమి.. తమిళ ప్రజల హక్కుల్ని హరించడానికి ప్రయత్నించినప్పుడు, "గో బ్యాక్ మోడీ"ని ప్రారంభించారని..మీరు మళ్లీ ప్రయత్నిస్తే ఈసారి "గెట్ అవుట్ మోడీ" అనే స్వరం వినిపిస్తోందంటూ హెచ్చరించారు.



Next Story

Most Viewed