UP Governor: కుంభకర్ణుడు గొప్ప సాంకేతిక నిపుణుడు.. యూపీ గవర్నర్ షాకింగ్ వ్యాఖ్యలు

by Shamantha N |
UP Governor: కుంభకర్ణుడు గొప్ప సాంకేతిక నిపుణుడు.. యూపీ గవర్నర్ షాకింగ్ వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: కుంభకర్ణుడి గురించి ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్(UP Governor) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారింది. కుంభకర్ణుడు ఆరు నెలలు నిద్రపోయాడన్నది నిజం కాదని.. ఆ సమయంలో రహస్యంగా యంత్రాల తయారీలో నిమగ్నమయ్యాడని ఆనంది బెన్ అన్నారు. ఆమె లక్నోలోని ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి భాషా యూనివర్సిటీ(Khwaja Muinuddin Chishti Bhasha Vishwavidyalaya ) కాన్వోకేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయి ప్రసంగించారు. “కుంభకర్ణుడు(Kumbhakarna) ఒక గొప్ప సాంకేతిక నిపుణుడు. రహస్యంగా అనేక యంత్రాలను తయారు చేశాడు. ఆ టెక్నాలజీ వేరే దేశాలకు తెలియకుండా రహస్యంగా కాపాడుకునేవాడు. రావణాసురుడే తన సోదరుడిని 6 నెలల పాటు బయటకు రాకుండా యంత్రాల తయారీలో నిమగ్నమవ్వాల్సిందిగా ఆదేశించారు. కానీ కుంభకర్ణుడు 6 నెలలు నిద్రపోతాడు అంటూ బయటకు ఒక వదంతి సృష్టించారు” ” అంటూ ఆనందిబెన్ అన్నారు. ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కాంగ్రెస్ విమర్శలు

ఆనందిబెన్ పటేల్ ఇదే కార్యక్రమంలో చేసిన మరో వ్యాఖ్య కూడా వైరల్ అవుతోంది. విమానం అనే కాన్సెప్ట్ వేదకాలంలోనే భరద్వాజ మహర్షి ప్రతిపాదించారని ఆమె పేర్కొన్నారు. విమానం కనిపెట్టింది రైట్ సోదరులు అనే మాట కూడా నిజం కాదని ఆమె అన్నారు. రావణుడు సీతను ఏ విమానంలో ఎత్తుకెళ్లాడో కూడా ప్రజలకు తెలియదని అన్నారు "మీరు ఎప్పుడైనా దీని గురించి ఆలోచించారా?" అని విద్యార్థులను ప్రశ్నించారు. పూర్వీకులు ఎన్నో ఆవిష్కరణలు చేశారని, వాటినే నేటి ప్రపంచం ఉపయోగించుకుంటోందని పేర్కొన్నారు. మన పురాతన గ్రంధాలను విద్యార్థులు లోతుగా అధ్యయనం చేయాలని, అందులోని విజ్ఞానాన్ని వివిధ భాషల్లో మిగతా ప్రపంచానికి తెలియపరచాలని సూచించారు. ఇకపోతే, ఆనందిబెన్ వ్యాఖ్యలపై వీడియో క్లిప్‌ను కాంగ్రెస్ నేతలు ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యురాలు, ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం ఛైర్‌పర్సన్ సుప్రియా శ్రీనాథే సోషల్ మీడియాలో ఆ వీడియోను పోస్ట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. యూనివర్సిటీ విద్యార్థులకు ఇలాంటి నాలెడ్జ్ అందిస్తున్నారని చురకలు అంటించారు.

Advertisement

Next Story

Most Viewed