Manipur: మణిపూర్ లో మరోసారి చెలరేగిన హింస

by Shamantha N |   ( Updated:2025-03-08 16:22:33.0  )
Manipur: మణిపూర్ లో మరోసారి చెలరేగిన హింస
X

దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్ లో రెండు జాతుల మధ్య ఘర్షణతో హింస చెలరేగింది. అల్లకల్లోలంగా మారిన మణిపూర్ లో (Manipur) శనివారం నుంచి అన్ని మార్గాల్లో ప్రజల రాకపోకలు స్వేచ్ఛాయుతంగా సాగుతున్నాయి. అయితే, ఫ్రీ మూమెంట్ అమల్లోకి వచ్చిన తొలిరోజే.. కుకీలు నిరసన చేపట్టారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు స్వేచ్ఛగా తిరిగేందుకు అనుమతించవద్దని కుకీలు డిమాండ్ చేశారు. కాంగ్ పోక్పి జిల్లాలో పలుచోట్ల నిరసన చెలరేగాయి. కుకీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో భద్రతా దళాల రక్షణ మధ్య నడిపిన బస్సులను నిరసనకారులు అడ్డుకున్నారు. వాహనాలపైకి రాళ్లు రువ్వారు. పలు చోట్ల రోడ్డను దిగ్బంధించేందుకు యత్నించారు. గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు.

నిరసనకారులను చెదరగొట్టిన భద్రతాదళాలు

కాగా, కుకీ నిరసనకారులను చెదరగొట్టేందుకు భద్రతా దళాలు యత్నించాయి. దీంతో మరోసారి ఘర్షణలు చెలరేగాయి. పలుచోట్ల భద్రతా సిబ్బంది లాఠీఛార్జ్ కూడా చేశారు. ఇందులో కొందరు కుకీ మహిళలు గాయపడ్డారు. ఈ ఘర్షణలకు సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరోవైపు, మణిపూర్‌లో ఏడాదిన్నరపైగా మైతీ, కుకీ జాతుల మధ్య ఘర్షణలు కొనసాగాయి. వందలాది మంది మరణించారు. వేలాది మంది ఇళ్లు కోల్పోయిన తర్వాత ప్రజలు నిరాశ్రయులయ్యారు. వారి కోసం భద్రతా దళాల రక్షణలో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. అయితే, ఫిబ్రవరిలో సీఎం ఎన్ బీరేన్ సింగ్ రాజీనామా చేశారు. దీంతో మణిపూర్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించింది.

Read More ....

Syria: సిరియాలో మళ్లీ హింస.. 70 మంది మృతి !




Next Story