Kiren Rijiju: ప్రజల బాధలు పట్టవు.. పార్లమెంటులో తమాషా చేశారు

by Shamantha N |
Kiren Rijiju: ప్రజల బాధలు పట్టవు.. పార్లమెంటులో తమాషా చేశారు
X

దిశ, నేషనల్ బ్యూరో: పార్లమెంటు ఆవరణలో ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇంటర్వ్యూ నిర్వహించడంపై కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాహుల్ పార్లమెంటు ముందు తమాషా చేశారని ఫైర్ అయ్యారు. ‘‘రాహుల్‌కు ప్రజల బాధలు పట్టవు.. కానీ మిగిలిన ఎంపీలు అలా లేరు. తమను ఎన్నుకున్న ప్రజలపై వారికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. సమాజ్‌వాదీ, టీఎంసీ, రాజ్యసభలోని కాంగ్రెస్‌ ఎంపీలు, లోక్‌సభలోని కొందరు ఎంపీలకు పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనాలని ఉంది. కానీ, రాహుల్ ప్రధానిని అవమానపరుస్తూ పార్లమెంటు వద్ద తమాషా చేశారు. ఆ తర్వాత విదేశాలకు వెళ్లి తన హాలిడేస్‌ను ఆస్వాదిస్తారు’’ అని కిరణ్‌ రిజిజు సోషల్‌ మీడియాలో ఫైర్ అయ్యారు. అదానీ అంశంపై చర్చకు డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ నిరసనలు చేపడుతున్నా.. దీనికి సమాజ్‌వాదీ (Samajwadi Party), తృణమూల్‌ కాంగ్రెస్‌ (Trinamool) పార్టీలు దూరంగా ఉంటున్నాయని గుర్తుచేశారు. ‘ఇండియా కూటమి’లో చీలికలు వచ్చాయనడానికి ఇదే నిదర్శనమని అన్నారు.

వాయిదాల పర్వం

శీతాకాల సమావేశాలు మొదలైనప్పటినుంచి పార్లమెంటు (Parliament)లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. అదానీ వ్యవహారం (Adani Issue), యూపీలోని సంభల్‌ అల్లర్లు తదితర అంశాలపై చర్చకు విపక్షాలు పట్టుపడుతుండటంతో గత వారమంతా సభా కార్యకలాపాలు స్తంభించాయి. అదానీ వ్యవహారంపై పార్లమెంట్‌లో చర్చ జరపాలన్న డిమాండ్‌తో కాంగ్రెస్‌ కొన్ని రోజులుగా ఆందోళన చేస్తోంది. కాగా దీనికి సమాజ్‌వాదీ (Samajwadi Party), తృణమూల్‌ కాంగ్రెస్‌ (Trinamool) పార్టీలు దూరంగా ఉన్నాయి. సోమవారం మరోసారి పార్లమెంట్ ఆవరణలో విపక్ష నేతలు నిరసన చేపట్టారు. ప్రధాని మోడీ, ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీలుగా కాంగ్రెస్ ఎంపీలు మాస్కులు ధరించగా.. రాహుల్ గాంధీ వారిని ఇంటర్వ్యూ చేశారు. దీనిపైనే, కిరిణ్ రిజిజు విమర్శలు గుప్పించారు.

Next Story

Most Viewed