70 కోట్ల మంది వర్సెస్ 22 మంది.. రాహుల్‌గాంధీ చెప్పిన లెక్క

by Dishanational4 |
70 కోట్ల మంది వర్సెస్ 22 మంది.. రాహుల్‌గాంధీ చెప్పిన లెక్క
X

దిశ, నేషనల్ బ్యూరో : కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ లోక్‌సభ అభ్యర్థి రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. తాను బీజేపీపై అలుపెరుగని యుద్ధం చేస్తుంటే.. కేరళ సీఎం విజయన్ మాత్రం తనను 24 గంటలు విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) కూటమి ఆధ్వర్యంలో గురువారం కొట్టాయం జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ‘‘నాపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. కారణమేంటో తెలియదు కానీ.. సీఎం విజయన్‌ను మాత్రం కాషాయ పార్టీ పల్లెత్తు మాట కూడా అనడం లేదు. ఎందుకలా చేస్తోందో ఎవరికీ అంతుచిక్కడం లేదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ఇప్పుడు మన దేశంలోని 70 కోట్ల మంది దగ్గరున్న సంపదకు సమానమైన సంపద కేవలం 22 మంది చేతుల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మనదేశం సూపర్ పవర్ అని ఎలా చెప్పుకోగలం ? మన రైతులు ఆపన్నహస్తం కోసం అలమటిస్తున్నారు. మన యువకులు ఉద్యోగాల కోసం తల్లడిల్లుతున్నారు. మనదేశం సూపర్ పవర్ అని ఎలా చెప్పుకోగలం ?’’ అని రాహుల్ గాంధీ కామెంట్ చేశారు.

Next Story

Most Viewed