Karnataka : కర్ణాటకలో రోగులకు గౌరవంగా చనిపోయే హక్కు

by Shamantha N |
Karnataka : కర్ణాటకలో రోగులకు గౌరవంగా చనిపోయే హక్కు
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక ప్రభుత్వం ఓ వినూత్నమైన ఆదేశాలను అమలు చేయనుంది. ఇక నుంచి కర్ణాటకలో రోగులు ఎవరైనా గౌరవంగా చనిపోవాలనుకుంటే దానికి అనుమతి ఇస్తారు. అయితే, కొన్ని షరతులు వర్తిస్తాయి. సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు సిద్ధరామయ్య సర్కారు ఇలాంటి ఉత్తర్వులు అమలు చేయనుంది. రోగులకు గౌరవంగా చనిపోయే హక్కు అనుమతి ఇవ్వడంపై నిర్ణయం తీసుకోవడానికి ఇద్దరు వైద్యులతో కూడిన రెండు కమిటీలను ఏర్పాటు చేయాలని కూడా ఈ ఉత్తర్వులో ప్రస్తావించింది. రోగులు గౌరవంగా చనిపోయే హక్కు కోసం సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడానికి "చారిత్రాత్మక" ఆదేశాన్ని జారీ చేసిందని కర్ణాటక ఆరోగ్య మంత్రి దినేష్ గుండు రావు అన్నారు. రోగి పరిస్థితి అత్యంత విషమంగా ఉండి, వ్యాధి పూర్తిగా నయం కాదని చట్టబద్ధమైన మెడికల్ బోర్డు ప్రకటించిన తర్వాతే లైఫ్ సపోర్ట్ తొలగిస్తారని చెప్పుకొచ్చారు. రోగులు తమకు ఇవ్వాల్సిన చికిత్సపై ముందుగానే సూచనలు జారీచేసే పత్రాన్ని సజీవ వీలునామా అంటారని అన్నారు. దీనికి రోగుల కుటుంబ సభ్యుల నుంచి కూడా అనుమతి ఉండాలన్నారు. కర్ణాటక ప్రగతిశీల రాష్ట్రమని.. సమాజం కోసం ఉదారవాద, సమాన విలువలు నిలబెట్టడంతో ఎప్పుడూ ముందుంటుందని దినేష్ రావు అన్నారు.

సుప్రీం కోర్టు ఏం అందంటే?

ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారికి గౌరవంగా ప్రాణం తీసివేసే కారుణ్య మరణ విధానానికి సుప్రీం కోర్టు గతంలో అనుమతించింది. పరోక్ష కారుణ్య మరణాలు, వాటి కోసం పరిగణించే లివింగ్ విల్ అనుమతించదగినవే అని తెలిపింది. ఈ మేరకు కొన్ని కఠిన మార్గదర్శకాలను జారీ చేసింది. చట్టాన్ని తీసుకొచ్చేంత వరకు ఈ మార్గదర్శకాలు అమల్లో ఉంటాయని తెలిపింది. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


Next Story