న్యాయప్రక్రియ సకాలంలో జరగాలి: కేజ్రీవాల్ అరెస్టుపై మరోసారి స్పందించిన అమెరికా

by Dishanational2 |
న్యాయప్రక్రియ సకాలంలో జరగాలి: కేజ్రీవాల్ అరెస్టుపై మరోసారి స్పందించిన అమెరికా
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై అమెరికా చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ గ్లోరియా బెర్బెనాకు సమన్లు సైతం జారీ చేసింది. అయితే ఈ నోటీసులు పంపిన అనంతరం అమెరికా మరోసారి స్పందించింది. యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మాట్లాడుతూ..సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ సహా భారత్‌లో జరుగుతున్న ఇతర చర్యలను నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. ప్రతి సమస్యకూ పారదర్శకమైన, న్యాయ ప్రక్రియ సకాలంలో జరుగుతుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్యాంక్ అకౌంట్లను స్తంభింపజేయడంపై కూడా మిల్లర్ స్పందించారు. ‘ఆదాయ పన్ను శాఖ అధికారులు తమ బ్యాంకు ఖాతాలను కొన్నింటిని నిలుపుదల చేశామని కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు కూడా గమనించాం. ఈ వ్యవహారం కాంగ్రెస్‌కు ఎన్నికల ప్రచారంలో సవాల్‌గా మారొచ్చు. ఏ సమస్యకైనా పారదర్శక విచారణ జరగాలి. దీనిని యూఎస్ ప్రోత్సహిస్తుంది’ అని తెలిపారు.

కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈ నెల 21న సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. అనంతరం జర్మనీ మొదటగా స్పందించగా భారత్ సీరియస్ అయింది. అనంతరం అమెరికా సైతం కేజ్రీవాల్ అరెస్టుపై వ్యాఖ్యలు చేసింది. భారత్‌లో ప్రతిపక్ష నేత అరెస్టుపై పరిణమాలను నిశితంగా పరిశీలిస్తున్నామని, దీనిపై న్యాయ విచారణ పారదర్శకంగా జరగాలని కోరుకుంటున్నట్టు అమెరికా విదేశాంగ అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు. దీనిపై భారత్ సీరియస్ అయింది. అమెరికా రాయబార కార్యాలయ ప్రతినిధిని విదేశాంగ శాఖ కార్యాలయానికి పిలుచుకుని సుమారు 40 నిమిషాల పాటు చర్చలు జరిపింది. ఇతర దేశాల సార్వభౌమాధికారం విషయంలో జోక్యం చేసుకోవడం సరికాదని తెలిపింది. ఈ నేపథ్యంలోనే మరోసారి యూఎస్ స్పందిచడం గమనార్హం.


Next Story