కర్ణాటక ఎన్నికల్లో ‘జై బజ్‌రంగ్ బలి’.. రాష్ట్ర ప్రజలకు మోడీ కీలక సూచన

by Sathputhe Rajesh |
కర్ణాటక ఎన్నికల్లో ‘జై బజ్‌రంగ్ బలి’.. రాష్ట్ర ప్రజలకు మోడీ కీలక సూచన
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక రాష్ట్రం మూడబిద్రి నియోజకవర్గంలో ప్రధాని మోదీ పర్యటించారు. మే 10న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. గిరిజనులను ఉద్దేశించి మాట్లాడుతూ వారిని కాంగ్రెస్ పార్టీ కేవలం ఓటు బ్యాంకుగానే చూసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గిరిజనులను సౌకర్యాలు లేకుండా చేసిందన్నారు. అలాగే గిరిజన నాయకత్వాన్ని కూడా ముందుకు రానివ్వలేదని ఆరోపించారు. ఈ కారణంగానే నేడు దేశంలోని గిరిజన సమాజం కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలనే పట్టుదలతో ఉందని మోదీ తెలిపారు.

ఇక కాంగ్రెస్ హయాంలో జరిగిన రేషనింగ్ విధానంపైనా ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో 4 కోట్ల 20 లక్షల నకిలీ పేర్లకు రేషన్ ఇచ్చారని మోదీ తెలిపారు. 4 కోట్ల నకిలీ పేర్లకు గ్యాస్ సబ్సిడీ, మహిళా సంక్షేమం పేరుతో కోటి మంది నకిలీ పేర్లకు డబ్బులు పంపారని ఆరోపించారు. 30 లక్షల మంది నకిలీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు పంపిణీ చేశారని మండిపడ్డారు. దేశంలోని ప్రతి మూల, ప్రభుత్వాసుపత్రుల్లో అవినీతి పాల్పడిందని, ఆ డబ్బంతా కాంగ్రెస్‌లోని పై నుంచి కింది వరకు కూర్చున్న అవినీతి నేతల జేబుల్లోకి వెళుతోందని వ్యాఖ్యానించారు.

ఏళ్ల తరబడి కాంగ్రెస్ 'పోషించిన' అవినీతి వ్యవస్థను తాను చితక్కొట్టానని కాంగ్రెస్ పార్టీ తనపై తీవ్ర విమర్శలు చేస్తోందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ దశాబ్దాల దుష్టపాలనతో ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిందని, అందుకే తప్పుడు ఆరోపణలు, తప్పుడు హామీలు చేస్తుందన్నారు. నేటికీ కర్ణాటకలోని ప్రతి పథకంలో 85% కమీషన్ తినడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందని మోదీ ఎద్దేవా చేశారు. అసలు కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఏం చేసిందని మోదీ ప్రశ్నించారు. ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్‌ను కర్ణాటక శాసిస్తుందని తనకు తెలుసన్నారు. కర్ణాటకలో ఎవరైనా దుర్వినియోగ సంస్కృతిని అంగీకరిస్తారా?అని నిలదీశారు. దుర్భాషలాడిన వారిని కర్ణాటక క్షమిస్తుందా? అని ప్రశ్నించారు. ఓటు వేసే ముందు 'జై బజరంగ్ బలి' అని జపించాలని మోదీ పిలుపు నిచ్చారు.

Advertisement

Next Story