ISRO: స్పేడెక్స్ డాకింగ్ సక్సెస్ ఫుల్.. ఆ మూడు దేశాల సరసన చేరిన భారత్

by Shamantha N |
ISRO: స్పేడెక్స్ డాకింగ్ సక్సెస్ ఫుల్.. ఆ మూడు దేశాల సరసన చేరిన భారత్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో ఘనత సాధించింది. స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియ విజయవంతం అయ్యింది. స్పేడెక్స్‌ (SpaDeX) డాకింగ్‌ ప్రక్రియ విజయవంతంగా పూర్తయినట్లు ఇస్రో (ISRO) గురువారం ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించింది. కాగా, ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్‌ నిలిచింది. గతేడాది డిసెంబరు 30న తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లో నుంచి ఎస్‌డీఎక్స్‌01 (ఛేజర్‌), ఎస్‌డీఎక్స్‌02 (టార్గెట్‌) శాటిలైట్లను పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సీ60 (PSLV)లో నింగిలోకి పంపింది. ఈ ఉపగ్రహాల బరువు 220 కిలోగ్రాములు. వీటిని భూమి నుంచి 475 కిలోమీటర్ల దూరంలో వృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టారు. ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ బయలుదేరిన 15.09 నిమిషాలకు స్పేడెక్స్‌-1బి, 15.12 నిమిషాలకు స్పేడెక్స్‌-1ఎ రాకెట్‌ నుంచి విడిపోయాయి. ఆ తర్వాత వీటి డాకింగ్‌ (Docking) కోసం మూడు సార్లు ప్రయత్నించగా.. పలు కారణాల వల్ల ఇది వాయిదా పడుతూ వచ్చింది. చివరకు గురువారం వీటి అనుసంధాన ప్రక్రియను చేపట్టారు. కాగా.. ఆ ప్రక్రియ విజయవంతం అయ్యింది. నింగిలోకి పంపించిన రెండు ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానం అయినట్లు ఇస్రో ప్రకటించింది.

నాలుగో దేశంగా..

ఈ క్రమంలోనే గత ఆదివారం రెండు ఉపగ్రహాల మధ్య దూరాన్ని 15 మీటర్ల నుంచి 3 మీటర్లకు తీసుకొచ్చారు. అక్కడ ఉపగ్రహాలను హోల్డ్‌ చేసి డాకింగ్‌ (Docking)ను మొదలుపెట్టారు. ఇది విజయవంతమైనట్లు ఇస్రో (ISRO) తమ పోస్ట్‌లో రాసుకొచ్చింది. ఇందుకు శ్రమించిన సాంకేతిక బృందానికి, యావత్‌ భారతీయులకు అభినందనలు తెలిపింది. అయితే, ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్‌ నిలిచింది. ఇప్పటి వరకు చైనా, రష్యా, అమెరికా మాత్రమే అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను అనుసంధానం చేస్తున్నాయి. స్పెడెక్స్ ప్రయోగంతో ఈ తరహా సాంకేతికతలో భారత్‌ కూడా ఆ దేశాల సరసన చేరింది.



Next Story