Netanyahu : మూడు అవినీతి కేసులు.. రేపు కోర్టు ఎదుటకు ఇజ్రాయెల్ ప్రధాని

by Hajipasha |
Netanyahu : మూడు అవినీతి కేసులు.. రేపు కోర్టు ఎదుటకు ఇజ్రాయెల్ ప్రధాని
X

దిశ, నేషనల్ బ్యూరో : ఇజ్రాయెల్(Israel) ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) మూడు అవినీతి కేసులను ఎదుర్కొంటున్నారు. వీటిపై న్యాయ విచారణను ఎదుర్కొనే క్రమంలో ఆయన మంగళవారం రోజు కోర్టు ఎదుట హాజరుకానున్నారు. మోసం, విశ్వాస ఘాతుకం, లంచాలను పుచ్చుకోవడం వంటి అభియోగాలతో నెతన్యాహుపై కేసులు నమోదయ్యాయి. వాస్తవానికి వీటిపై న్యాయ విచారణ 2020 సంవత్సరంలోనే మొదలైంది. అయితే 2023 అక్టోబరు 7 నుంచి గాజాతో ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఈ ప్రక్రియ తాత్కాలికంగా ఆగిపోయింది. ఉద్రిక్తతలు తగ్గడంతో ఇప్పుడు మళ్లీ కోర్టు ఈ అంశాన్ని విచారణకు చేపట్టింది.

తనకు అనుకూలంగా మీడియా కవరేజీ ఇచ్చేందుకు పలువురు మీడియా సంస్థల అధినేతలకు ప్రభుత్వపరమైన సహకారాన్ని అందించారనే అభియోగం నెతన్యాహు(Netanyahu)పై ఉంది. ఒక ప్రఖ్యాత హాలీవుడ్ ప్రొడ్యూసర్ వ్యక్తిగత ప్రయోజనాలను కాపాడి.. ఆయన నుంచి విలువైన కానుకలను అందుకున్నారనే ఆరోపణలు ఇజ్రాయెల్‌ ప్రధానిపై ఉన్నాయి. మూడు కేసులకు సంబంధించి ఇప్పటివరకు 140 మంది నుంచి వాంగ్మూలాలను సేకరించారు. గతంలో నెతన్యాహుకు సన్నిహితుడిగా వ్యవహరించిన ఒక వ్యక్తి కూడా ఈ కేసు విచారణ క్రమంలో ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. నెతన్యాహుపై నమోదైన అభియోగాలను బలపరిచే వేలాది రికార్డింగ్స్, పోలీసు డాక్యుమెంట్స్, టెక్ట్స్ మెసేజ్‌లను లాయర్లు కోర్టుకు సమర్పించారని సమాచారం. 2026 సంవత్సరంకల్లా ఈకేసులో విచారణ పూర్తయి తీర్పు వెలువడుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఒకవేళ తీర్పు వ్యతిరేకంగా వస్తే.. దేశ సుప్రీంకోర్టులో నెతన్యాహు అప్పీల్ చేస్తారని అంటున్నారు.

Advertisement
Next Story