Israel hamas: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి తెర.. కాల్పుల విరమణకు ఇరు పక్షాల అంగీకారం !

by vinod kumar |
Israel hamas: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి తెర.. కాల్పుల విరమణకు ఇరు పక్షాల అంగీకారం !
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్- హమాస్ (Israel-hamas) యుద్ధానికి తెరపడింది. ఇరు పక్షాల మధ్య ఎట్టకేలకు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. గాజాలో కాల్పుల విరమణ, బందీల విడుదలకు ఇజ్రాయెల్ ప్రభుత్వం, ఉగ్రవాద సంస్థ హమాస్‌లు అంగీకరించాయి. చర్చలకు మధ్య వర్తిత్వం వహిస్తు్న్న ఖతార్ ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ జాసిమ్ అల్ థానీ బుధవారం హమాస్, ఇజ్రాయెల్ ప్రతినిధులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ మీటింగ్‌ అనంతరం కాల్పుల విరమణకు ఇరు పక్షాలు అంగీకరించినట్టు తెలుస్తోంది. దీంతో 15 నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పడినట్టైంది. ఈ ఒప్పందం ప్రకారం.. తమ వద్ద ఉన్న బందీలను హమాస్ విడుదల చేయనుండగా, పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ దశల వారిగా రిలీజ్ చేయనుంది. ఆరు వారాల పాటు ఈ ఒప్పందం అమలులో ఉండనుంది. అయితే కాల్పుల విరమణకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఈజిప్టు, ఖతార్ మధ్యవర్తిత్వం.. మద్దతు తెలిపిన అమెరికా

అమెరికా మద్దతుతో ఈజిప్ట్, ఖతార్‌ల నేతృత్వంలో నెలల తరబడి కాల్పుల విరమణపై చర్చలు జరిగాయి. సుధీర్ఘ చర్చల తర్వాత తాము కాల్పుల విరమణకు దగ్గరగా ఉన్నామని ఇరుపక్షాలు గతంలో పరోక్షంగా వ్యాఖ్యానించాయి. ఈ నేపథ్యంలోనే ఖతార్ రాజధాని దోహాలో ఒప్పందం జరగడం గమనార్హం. అయితే అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికన్నా కొద్ది రోజుల ముందే ఈ ఒప్పందం జరగడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ మంత్రివర్గంలో సమర్పించాల్సి ఉంది. అక్కడ ఆమోదం లభించిన వెంటనే కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి రానున్నట్టు సమాచారం. త్వరలోనే ఇది అమలు కానున్నట్టు పలు కథనాలు వెల్లడించాయి.

బందీలంతా త్వరలోనే రిలీజ్: డొనాల్డ్ ట్రంప్

అమెరికా కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ఒప్పందంపై స్పందించారు. పశ్చిమాసియాలో బందీలను విడుదల చేయడానికి మేము ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని తెలిపారు. వారంతా త్వరలోనే రిలీజ్ అవుతారని స్పష్టం చేశారు. గాజా ఎప్పుడూ ఉగ్రవాదులకు సురక్షితమైన స్వర్గధామం కాకూడదని, ఇజ్రాయెల్ మిత్రదేశాలతో కలిసి పని చేస్తానని చెప్పారు. కాగా, ఈ ఒప్పందాన్ని వీలైనంత త్వరగా అమలు చేయాలని ట్రంప్ గతంలోనే డిమాండ్ చేశారు. బందీలను విడుదల చేయకపోతే, పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ క్రమంలోనే ఒప్పందం జరగడం గమనార్హం.

పౌరులు తమ స్థలాల నుంచి కదలొద్దు: హమాస్

కాల్పుల విరమణ అధికారికంగా ధృవీకరించే వరకు పౌరులు తమ స్థలాల నుంచి కదలొద్దని హమాస్ ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు గాజాలోని హమాస్ అధికారిక మీడియా కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘కాల్పుల విరమణ అధికారిక ప్రారంభానికి ముందు పౌరులు తమ స్థానాల నుంచి ఎక్కడికీ వెళ్లొద్దు. కాల్పుల విరమణ సమయం గురించి సమాచారాన్ని అందించాకే వెళ్లాలి’ అని పేర్కొంది. కాగా, 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై మిలిటెంట్ గ్రూప్ హమాస్ భీకర దాడి చేసి1,200 మందిని చంపి 250 మందిని బందీలుగా పట్టుకుంది. దీంతో అప్పటి నుంచి యుద్ధం ప్రారంభం కాగా గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఈ దాడుల్లో 46,000 మంది పాలస్తీనియన్లు మరణించగా అనేక మంది స్థానభ్రంశం చెందారు.

Advertisement

Next Story