NEET: పేపర్ లీక్ లో ఈ ఆధారాలు నిజం కాదా?.. కాంగ్రెస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |   ( Updated:2024-06-14 12:10:13.0  )
NEET: పేపర్ లీక్ లో ఈ ఆధారాలు నిజం కాదా?.. కాంగ్రెస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మోదీ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి, ఎన్టీఏ ద్వారా నీట్ స్కామ్‌ను కప్పిపుచ్చడం ప్రారంభించిందని, పేపర్ లీక్ కాకపోతే ఇవన్నీ ఎందుకు చేశారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. నీట్ పేపర్ లీక్ ఇష్యూపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన మోడీ ప్రభుత్వం పై సంచలన ఆరోపణలు చేశారు. నీట్ లో పేపర్ లీక్ కాకపోతే.. పేపర్ లీక్ కారణంగా బీహార్‌లో 13 మంది నిందితులను ఎందుకు అరెస్టు చేశారని, పాట్నా పోలీస్‌లోని ఆర్థిక నేరాల విభాగం విద్యా మాఫియాకు 30 నుంచి 50 లక్షలు చెల్లించడాన్ని బహిర్గతం చేయడం నిజం కాదా? అని ప్రశ్నించారు.

అలాగే నీట్-యూజీ చీటింగ్ రాకెట్ గుజరాత్‌లోని గోద్రాలో ఛేదించబడలేదని, కానీ కోచింగ్ సెంటర్ నడుపుతున్న వ్యక్తి, ఉపాధ్యాయుడు, మరొక వ్యక్తితో సహా ముగ్గురు వ్యక్తులు ఇందులో ఉన్నారని, గుజరాత్ పోలీసుల ప్రకారం, నిందితుల మధ్య రూ. 12 కోట్లకు పైగా లావాదేవీలు వెలుగులోకి వచ్చాయని, మోదీ ప్రభుత్వం చెబుతున్నట్లుగా నీట్‌లో పేపర్ లీక్ కాకపోతే ఈ అరెస్టులు ఎందుకు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం దేశ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నది గతంలోనా? ఇప్పుడా? అని ఖర్గే మండిపడ్డారు.

24 లక్షల మంది యువత ఆకాంక్షలను మోదీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని, వారంతా డాక్టర్లు కావడానికి నీట్ పరీక్షకు హాజరై, 1 లక్ష మెడికల్ సీట్ల కోసం పగలు రాత్రి కష్టపడుతున్నారని అన్నారు. ఈ లక్ష సీట్లలో దాదాపు 55,000 ప్రభుత్వ కళాశాలల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఓసీ కేటగిరీలకు రిజర్వ్ చేయబడిన సీట్లు ఉన్నాయని తెలిపారు. ఈసారి మోడీ ప్రభుత్వం ఎన్టీఏని దుర్వినియోగం చేసి, మార్కులు, ర్యాంకులను భారీగా రిగ్గింగ్ చేసిందని ఆరోపించారు. దీని కారణంగా రిజర్వ్డ్ సీట్లకు కట్ ఆఫ్ కూడా పెరిగిందని, అంతేగాక గ్రేస్‌మార్కులు, పేపర్‌ లీక్‌లు, రిగ్గింగ్‌లతో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను రాయితీపై ప్రభుత్వ ప్రవేశాలు పొందకుండా అడ్డుకున్నట్లు తెలుస్తోందని మల్లికార్జున ఖర్గే అన్నారు.

Advertisement

Next Story

Most Viewed