Indus Waters Treaty cancelled : పాకిస్తాన్ కు సింధు జలాలు ఆపడం సాధ్యమేనా? నెట్టింట్లో తీవ్ర చర్చ

by M.Rajitha |   ( Updated:2025-04-27 10:56:48.0  )
Indus Waters Treaty cancelled : పాకిస్తాన్ కు సింధు జలాలు ఆపడం సాధ్యమేనా? నెట్టింట్లో తీవ్ర చర్చ
X

దిశ, వెబ్ డెస్క్ : పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack) తర్వాత పాకిస్తాన్(Pakistan) పట్ల భారత్(Bharat) పలు కఠిన నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. వాటిలో సింధు నదీ జలాల ఒప్పందం రద్దు(Indus Waters Treaty cancelled) కూడా ఒకటి. పాక్ లోని అత్యధిక భాగం సింధు జలాలపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకోవడం పాక్ వ్యవసాయం, తాగు నీటిపై ఘననీయమైన ప్రభావం పడనుంది. అయితే ఈ సింధు నదీ జలాల ఒప్పందం రద్దు అంశంపై ఇక పాకిస్థాన్ ఎడారి అవుతుందని, మోడీ పాక్‌కు గట్టి బుద్ధి చెప్పాడని అనేకమంది నెట్టింట్లో పోస్టులు పెట్టి సంబరాలు చేసుకున్నా.. మరోవైపు ఓ ప్రత్యేక చర్చ నడుస్తోంది. ఒకవేళ భారత్ ఆ నీటిని పాక్ కు వదలకపోతే.. ప్రాజెక్టుల్లో ఎన్నిరోజులు ఆ నీటిని పట్టి ఉంచగలదు అని.

భారత్ తీసుకున్న ఈ నిర్ణయం దీర్ఘకాలంలో, అంటే మరో 15-20 తర్వాత పాకిస్థాన్‌పై గట్టి ప్రభావం చూపగలుగుతుందేమో తప్ప, ప్రస్తుతానికి ఇది వారిపై ఒత్తిడి పెంచే అంశం మాత్రమే అని జలరంగ నిపుణులు విశ్లేసిస్తున్నారు. 1960లో ఏర్పాటు చేసిన సింధు నదీజలాల ఒప్పందం ప్రకారం ఆరు నదుల నీళ్లను భారత్-పాక్‌లు సమానంగా పంచుకోవాలి. ఇండస్, జీలం, చినాబ్ నదుల మీద ఎలాంటి ప్రాజెక్టులూ కట్టకూడదు. రెండూ వ్యవసాయరంగం కీలకమైన దేశాలు కావడంతో ఇన్నేళ్లూ పెద్దగా వివాదాలు లేకుండానే నదీజలాలను పంచుకున్నాయి. తూర్పున ప్రవహించే సట్లజ్, బీస్, రావి నదుల జలాలను భారత్ వాడుకుంటుండగా, పడమరన ప్రవహించే ఇండస్, జీలం, చినాబ్ నదుల నీళ్లను పాక్ వాడుకుంటోంది. ఇవేవీ పాకిస్థాన్‌లో పుట్టిన నదులు కావు. కానీ ఈ నదుల్లో 80 శాతం నీరు పాక్‌కే వెళ్తోంది. సింధు, పంజాబ్ ప్రాంతాల్లో వ్యవసాయానికి, తాగునీటికి ఇవే ప్రధాన వనరులు. పాకిస్థాన్ ఇప్పటికే తీవ్రమైన జలసంక్షోభంతో ఉంది. ప్రజలు ఈ విషయంలో చాలా విసుగెత్తి ఉన్నారు. కరాచీ లాంటి నగరాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి.

ఇప్పుడు సింధు నదీజలాల ఒప్పందం నిలిపివేత కారణంగా ఆ దేశ ప్రభుత్వం మీద ఒత్తిడి తీవ్రంగా పెరుగుతుందని భారత్ భావిస్తోంది. అయితే, ఒప్పందం నిలిపివేత జరగగానే సింధు నది నీళ్లు ఆగిపోవు. ఎందుకంటే సింధు, దాని ఉపనదులన్నీ జీవ నదులు. ఏడాది పొడవునా హిమాలయాల నుంచి నీరు వస్తూనే ఉంటుంది కాబట్టి, ఎక్కువ రోజులు నీటిని కిందికి వదలకుండా ఉండటం కష్టమే అంటున్నారు నిపుణులు. ఇప్పుడు నది నీళ్లను ఆపడానికో, మళ్లించడానికో ఆ మూడు నదులపై ప్రాజెక్టులు కట్టడం ఇప్పటికిప్పుడు మొదలుపెడితే కనీసం 10 నుంచి 20 ఏళ్లు పడుతుంది. అది కూడా భూసేకరణ పూర్తయ్యి, నిధులు సమకూరి, అందరూ సరే అంటేనే సాధ్యపడుతుంది. ఒకవేళ నిజంగా ప్రాజెక్టులు కట్టి, నీళ్లను ఆపే పరిస్థితి వస్తే ఆ ప్రభావం పాకిస్థాన్ మీద పడటానికి కనీసం 20 ఏళ్లు పడుతుంది. ఇదిలా ఉంటే ప్రాజెక్టుల్లో నీరు భారీగా చేరడంతో ఇప్పటికే జీలం నీటిని కిందికి పూర్తిగా వదిలేసింది భారత్.



Next Story

Most Viewed